హ్యాపీ బర్త్ డే.. ఏడు పదుల ఎనర్జిటిక్ లీడర్!
నారా చంద్రబాబు నాయుడు.. 75వ పడిలోకి అడుగిడుతున్న నిత్య యవ్వనుడు..! 46 ఏళ్లపాటు ప్రజాసేవలో తరించిన ధన్యుడు..! తెలుగువారికి రేపటి వెలుగు చూపిన ప్రకాశకుడు..! తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దార్శనికుడు..! తెలుగు జాతి ఆత్మవిశ్వాస ప్రతిష్ఠాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధనకు కంకణబద్ధుడు జాతీయ రాజకీయ యువనికపై తెలుగువారి ప్రాభవాన్ని చాటిన దురంధరుడు!. పేదల సంక్షేమం, ప్రజల సమగ్రాభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించిన వికాశకుడు..! ప్రజల వద్దకే పాలనకు శ్రీకారం చుట్టిన ఆద్యుడు..! బడుగు బలహీనులు, మైనారిటీల ఉన్నతికి అహరహం తపించిన సంవేదనాశీలుడు..! డ్వాక్రాలతో మహిళాభ్యుదయానికి నాంది పలికిన స్వాప్నికుడు..! యువతకు ఆత్మస్థయిర్యాన్నిచ్చిన ధీరోదాత్తుడు..! రాజకీయాన్ని రాష్ట్రహితం కోసం అన్వయించిన అపర చాణుక్యుడు..! సాంకేతిక విజ్ఞానాన్ని సామాన్యుని హితంకోసం వాడిన మేటి నాయకుడు..! నవ్యాంధ్ర ప్రగతికి తొలిబాట వేసిన కార్యశూరుడు..! విధ్వంసమైన నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి శంఖం పూరించిన సమరయోధుడు..! ఏడు పదుల ఎనర్జిటిక్ లీడర్.. టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు www.cinejosh.com ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది.
ఇదీ ట్రాక్ రికార్డ్!
సీబీఎన్.. పొలిటికల్ లెజెండ్.. ఈ పేరే ఓ బ్రాండ్.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్.. సంక్షేమాలకు బ్రాండ్ అంబాసిడర్.! బాబు అధికారంలో ఉన్నారంటే అదొక భరోసా..! 28 ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికై నూనూగు మీసాల యువకుడిగా ఉన్నప్పుడే అంజయ్య కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకుని.. తన ప్రతిభను చాటిన డైనమిక్ లీడర్.! రాజకీయ అవసరాల కన్నా ప్రజలే ముఖ్యమని, ప్రజలే అన్నింటికంటే ముందని చాటి చెప్పిన.. నమ్మిన గొప్ప రాజనీతిజ్ఞుడు! దేశ, రాష్ట్ర రాజకీయాల్లో గొప్ప చరిత్ర కలిగిన దమ్మున్న నేత.. ఎందరో ప్రధానులు, రాష్ట్రపతులను నిర్దేశించిన సీనియర్ లీడర్.! తెలుగునాట అభివృద్ధి బీజాలు నాటిన దార్శనిక నాయకుడు.. కొండలు, గుట్టలున్న హైదరాబాద్‌ను బంగారు గనిలా మార్చి తెలంగాణ ప్రజలకు కానుకగా ఇచ్చి.. హైటెక్ సిటీ కింగ్ మేకర్‌గా ఐటీ ఉద్యోగుల గుండెల్లో చోటు దక్కించుకున్న లీడర్. తెలుగుజాతి గర్వించే జాతీయ నాయకుడు.. విలువలెరిగిన, పరిణితి చెందిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ కలిగిన దమ్మున్నోడు!. అధికారంలో ఉన్నా లేకున్నా తెలుగుజాతి ఉజ్వల భవిష్యత్ కోసం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నిరంతర యోధుడు.
ఎవరూ రారు.. రాలేరు!
చంద్రబాబు.. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి.. పొలిటికల్ ఇండస్ట్రీని ఏలుతున్న రియల్ హీరో. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆయనది. ఎన్నో విజయాలు సాధించిన.. మరెన్నో పరాజయాలను ఎదుర్కొన్న ఘనుడు. రాజకీయాల్లో ఆయన రికార్డులను నాటి నుంచి నేటివరకూ ఎవరూ అధిగమించలేదు.. ఇక భవిష‌్యత్ లోనూ కష్టమే.! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లు.. విభజిత రాష్ట్రంలో ఐదేళ్లు సీఎంగా పనిచేశారు. అంటే దాదాపు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నారు. ఇక అధికారంలో లేకున్నా బాబు ట్రాక్ రికార్డే వేరు.. ప్రతిపక్ష నేతగా కూడా రికార్డే. దాదాపు పదహారేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న ఘనత ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబుకే సొంతం. ప్రతిపక్ష నేతగా అనుక్షణం ప్రజల పక్షాన నిలిచి, నిఖార్సైన రాజకీయాలకు నిలవెత్తు నిదర్శనమే నారా. బాబు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు.. అంతకుమించి ఆటుపోట్లను ఎదుర్కొన్నా అదరని బెదరని బెబ్బులి. ప్రజల నాడి తెలుసుకుంటూ కాలంతోపాటు పరిగెత్తే నాయకుడు. సంక్షోభాల నుంచి అవకాశాలు వెతకడం ఆయన నైజం.
డూ ఆర్ డై!
బాబు.. ఇప్పటి వరకూ ఎన్నో పుట్టిన రోజులు జరుపుకుని ఉండొచ్చు.. కానీ ఇది మాత్రం చాలా ప్రత్యేకమైన రోజని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా క్లిష్టపరిస్థితుల్లో జరుపుకుంటున్న పుట్టిన రోజు ఇది. ఈ ఏడాది చంద్రబాబుకు తన రాజకీయ జీవితంలోనే అత్యంత కీలకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరో నెల రోజుల్లో జరగబోయే ఎన్నికలు చంద్రబాబు రాజకీయ భవితవ్యాన్ని స్పష్టం చేస్తాయి. ఆయన ఒక్కడి భవితవ్యమే కాదు. ఈ ఎన్నికలతో అటు నారా లోకేశ్ భవితవ్యం, యావత్ తెలుగు దేశం పార్టీ భవితవ్యం కూడా ముడిపడి ఉందని సొంత పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి. బాబుకు ఇవి చావో రేవో తేల్చుకోవాల్సిన ఎన్నికలు. గెలిచి తీరాల్సిన ఎన్నికలు.. గెలవక తప్పని ఎన్నికలు. ప్రతి ఎన్నికలు లాగే 2024లోనూ కూటమిగట్టిన బాబు ఈ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే.. ఓడితే రాజకీయ ఉనికికే ప్రమాదం, పార్టీ ఫినిష్ అవుతుందని చెప్పుకుంటున్న పరిస్థితి. అందుకే ఈ ఎన్నికలు చంద్రబాబుకు జీవన్మరణ సమస్య అని చెప్పొచ్చు సుమీ..!