తెలంగాణకు కాబోయే హోం మంత్రి ఈయనేనా!!
తెలంగాణ ఎన్నికల్లో ఊహించని విజయం దక్కించుకున్న కాంగ్రెస్.. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ఆ తర్వాత కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేసింది కానీ.. కొన్ని కీలక శాఖలకు మాత్రం ఇంతవరకూ మంత్రులు లేరు. అందులో ఒకటి హోం శాఖ. ప్రస్తుతానికి రేవంత్ అదనంగా ఈశాఖను పర్యవేక్షిస్తున్నప్పటికీ.. రేపొద్దున ఎవరికి ఇవ్వొచ్చు..? అనేది పార్లమెంట్ ఎన్నికల ముందు జరుగుతున్న ప్రధాన చర్చ. అయితే.. ఈ శాఖ తనకే వస్తుందని.. ఇచ్చి తీరాల్సిందేనని గట్టిగానే ఆశపడుతున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దీంతో కాబోయే హోం మంత్రి ఈయనేనా అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే.. ఈయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్డు, భవనాలు.. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండటంతో తమ్ముడికి మంత్రి పదవి అంత ఆషామాషీ కాదనే చర్చ సైతం నడుస్తోంది.
గెలిపిస్తే మంత్రేనా!
ఉమ్మడి నల్గొండ జిల్లా నాటి నుంచి నేటి వరకూ కాంగ్రెస్ కంచుకోటే. జిల్లాలో ఊహించని రీతిలో ఎమ్మెల్యే స్థానాలను కూడా గెలుచుకుంది. ఇప్పుడు నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలను కూడా కైవసం చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి కోమటిరెడ్డి కుటుంబానికే టికెట్ ఇప్పించుకోవాలని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినా.. ఆఖరికి రేవంత్ తన అనుచరుడు, కోర్ టీమ్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. అయితే.. ఇప్పుడీ ఎంపీ అభ్యర్థి గెలుపును రాజగోపాల్ రెడ్డికి అప్పగించారు రేవంత్. చామలను గెలిపించుకుని వస్తే.. బంపరాఫర్ ఉంటుందని రేవంత్ చెప్పినట్లుగా సమాచారం. అందుకే ఎన్నికల ప్రచారంలో పదే పదే తాను కాబోయే హోం మంత్రిని అని పదే పదే చెబుతుండటాన్ని బట్టి చూస్తే ఇదే నిజమనిపిస్తోంది.
మంత్రి కావొచ్చు!
చామలను భువనగిరిలో భారీ మెజార్టీతో గెలిపించాలని.. అప్పుడు మంత్రిని కావొచ్చని రాజగోపాల్ రెడ్డి చెప్పడంతో ఆయన అభిమానులు, అనుచరులు ఆనందంలో మునిగితేలుతున్నారు. అంతేకాదు.. తాను హోం మంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. పనిలో పనిగా సెలవిచ్చేశారు. హోం మంత్రి అయితే బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపిస్తానని.. అందుకే గులాబీ నేతల తనను మంత్రి కాకుండా అడ్డుకుంటున్నారు.. కోరుకుంటున్నారని కూడా చెప్పుకొచ్చారు. మనసులో మాట బయటికి వచ్చింది సరే.. మంత్రి అయ్యే యోగం ఉందా లేదా అనేది చూడాలి. అన్నదమ్ములు ఇద్దరికీ మంత్రి పదవులు అంటే.. అది కూడా బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తికి ఇలా ఇస్తే కాంగ్రెస్ సమాజం ఊరుకుంటుందా..? అనేది ప్రశ్నార్థకమే మరి. ఏం జరుగుతుందో చూడాలి మరి.