అవును.. ఇన్నాళ్లు ఒకే ఒక్కమాటతో సతమతమైన వైసీపీకి ఒక్కసారిగా ఊపిరిపీల్చుకునేలా.. అదిరిపోయే శుభవార్త వచ్చేసింది. దీంతో అబ్బా.. ఎన్నికల ముందు ఇది కదా కిక్కు అంటే అని వైసీపీ శ్రేణులు అంటూ ఎగిరి గంతేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు జరిగిన మాజీ మంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ కేసు తెగిపోలేదు. నాటి నుంచి నేటి వరకూ ఈ కేసు వైసీపీని వీడట్లేదు. సీఎం వైఎస్ జగన్‌కు ఇదొక మాయని మచ్చగా మారింది. పోనీ.. త్వరితగతిన కొలిక్కి వచ్చే అవకాశమూ లేకుండా పోయింది. మరోవైపు.. సీబీఐను కేంద్రం నుంచి వైఎస్ జగన్ రెడ్డే ఆపుతున్నారనే టాక్ కూడా నడిచింది. ఇలా జరుగుతుండగానే 2024 ఎన్నికలు రానే వచ్చాయి. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డిలు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, పురంధేశ్వరి, నారా లోకేష్.. వీరంతా పదేపదే వైఎస్ వివేకా ప్రస్తావన తీసుకొస్తూ.. వైసీపీకి చేయాల్సిన నష్టం చేసుకుంటూ వస్తున్నారు.
ఇదీ రిలీఫ్..!
ఈ పరిస్థితుల్లో ఈ డేంజర్ జోన్ నుంచి బయటికి రావాలంటే వివేకా పేరు ఎవరినోటా వినపడొద్దని భావించిన వైసీపీ.. వివేకా హత్యపై వైసీపీ నేత సురేష్ బాబు కడప జిల్లా కోర్టును ఆశ్రయించారు. గురువారం నాడు సురేష్ తరుఫున లాయర్ నాగిరెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన తర్వాత.. వివేకా హత్యపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హత్య గురించి ఇక మీదట ఎవరూ మాట్లాడవద్దని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) పేర్లను కోర్టు చేర్చింది. వాస్తవానికి వీరి నోటి నుంచే పదేపదే వివేకా హత్య వ్యవహారం వచ్చేది. తాజా ఉత్తర్వులతో వీరందరి నోటికి తాళం పడినట్లు అయ్యింది. ఇకపై వీరంతా పొరపాటున కూడా వివేకా హత్యపై మాట్లాడకూడదు. కోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయ్.
బిగ్ రిలీఫ్!
వివేకాను ఎవరి హత్య చేశారు..? తెరవెనుక ఎవరున్నారు..? అనే విషయాలు అటుంచితే.. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఇదొక పెద్ద ప్లస్ పాయింటే. అయితే.. ప్లస్ కాస్త కొన్నిరోజులకే మైనస్ అవుతూ వచ్చింది. నాటి నుంచి నేటి వరకూ ఈ హత్య వైసీపీని వెంటాడుతూనే వస్తోంది. కచ్చితంగా ఈ వ్యవహారంతో ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే.. సొంతిట్లోని షర్మిల, సునీతనే వైసీపీ.. జగన్‌ను ఏకిపారేస్తూ మాట్లాడుతూ వచ్చారు. దీంతో వైసీపీకి తలనొప్పిగా ఉన్న ఈ ఘటనకు కొద్దిరోజులపాటు బ్రేక్ పడనుంది. సో.. ఇప్పుడు వైసీపీ ఊపిరిపీల్చుకోవచ్చన్న మాట.