ఎన్నికలు దగ్గరపడుతున్నాయ్.. నామినేషన్లకు సమయం ఆసన్నమైంది.. ఓ వైపు సర్వేలు.. మరోవైపు పార్టీలో రిపేర్ల పనిలో అధినేతలు బిజీబిజీగా గడుపుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలో పలువురు అభ్యర్థులను మారుస్తున్నారనే వార్త.. టికెట్లు దక్కించుకున్న నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయ్. అంటే.. ఇన్నాళ్లు చేసిన కసరత్తులు, సర్వేలు.. నివేదికలు అన్నీ మూలనపడేసి మార్పులు చేయాల్సిందేనని ఫిక్స్ అయ్యారన్న మాట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. నలుగురు అభ్యర్థులను మార్చే యోచనలో టీడీపీ.. ఒక అభ్యర్థిని మార్చడానికి వైసీపీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీలో ఎవరెవరు..?
అధికారికంగా రాబిన్ శర్మ.. అనధికారికంగా ప్రశాంత్ కిషోర్ టీడీపీకి వ్యూహకర్తలుగా పనిచేస్తున్న విషయం జగమెరిగిన సత్యమే. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని ఇరువుర్నీ స్ట్రాటజిస్టులుగా చంద్రబాబు పెట్టుకున్నారట. అయితే.. ఇప్పటి వరకూ వచ్చిన లోకల్, నేషనల్ సర్వేలు.. వ్యూహకర్తలతో చేయించిన సర్వేలు టీడీపీని కంగుతినేలా చేశాయట. దీంతో ఐవీఆర్ఎస్ సర్వేలు చేయించిన బాబు.. శింగనమల, తిరువూరు, గుంటూరు తూర్పు, మాడుగుల అభ్యర్థులను మార్చారని టాక్ నడుస్తోంది. ఇక పాత అభ్యర్థుల స్థానంలో కొత్తవారిని ప్రకటించడమే తరువాయి అని టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. శింగనమల నుంచి బండారు శ్రావణిని తీసేసి ఓ సీనియర్ నేతను.. తిరువూరు నుంచి పోటీ చేస్తున్న కొలికపూడి శ్రీనివాస్‌ను పక్కనెట్టి ఉండవల్లి శ్రీదేవిని.. మాడుగుల అభ్యర్థిని పక్కనెట్టి బండారు సత్యనారాయణ మూర్తిని బరిలోకి దింపడానికి సన్నాహాలు చేస్తున్నారట బాబు. ఇక గుంటూరు తూర్పు అభ్యర్థిని కూడా మార్చేయబోతున్నారట. ఆయా నియోజకవర్గాల్లో వ్యతిరేకత, ఎంపీ అభ్యర్థుల విజ్ఞప్తి, ఆర్థిక బలం.. సర్వేలు ఇవన్నీ బేరీజు చేసుకున్నాక చంద్రబాబు ఇలా చేస్తున్నారని టాక్ నడుస్తోంది.
వైసీపీలో సంగతేంటి..?
ఐప్యాక్ టీమ్ నుంచి వస్తున్న లీకుల ప్రకారం చూస్తే.. నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఉన్న ఖలీల్ అహ్మద్‌ను మార్చే యోచనలో వైఎస్ జగన్ రెడ్డి ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్‌ను నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాక ఆయన స్థానంలో.. అత్యంత ఆప్తుడు, నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా ఉన్న ఖలీల్‌ను ఎంపిక చేయడం జరిగింది. అయితే.. ప్రత్యర్థి టీడీపీ తరఫున మాజీ మంత్రి నారాయణను ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదని.. ఆయనకున్న ఆర్థిక, అంగ, రాజకీయ పలుకుబడి ముందు వైసీపీ అభ్యర్థి తేలిపోతున్నారట. దీంతో నారాయణను ఓడించడానికి సరైనోడు, సమర్థుడి కోసం వెతకగా.. రూరల్ అభ్యర్థి, బిజినెస్‌మెన్ ఆదాల ప్రభాకర్ రెడ్డి బంధువు.. జిల్లాలో పేరుగాంచిన ప్రముఖ కాంట్రాక్టర్‌ను నిలిపే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. నామినేషన్ల పక్రియ ప్రారంభం కానున్న ఈ సమయంలో మార్పులేంటని కొందరు అనుకుంటూ ఉండగా.. గెలుపు గుర్రాలే ముఖ్యమని అగ్రనాయకత్వం భావిస్తోందట. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మార్పు వార్తల్లో నిజానిజాలెంత అనేది ఒకట్రెండు రోజుల్లో తేలిపోనుంది.. వేచి చూద్దాం మరి.