జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకున్న పోతిన మహేష్.. పవన్ కల్యాణ్‌పై రోజురోజుకూ ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకూ సేనాని సతీమణి గురించి మాట్లాడుతూ రచ్చ రచ్చజేసిన పోతిన.. ఇప్పుడు ఏకంగా అసలు పవన్‌కు డబ్బులు ఎక్కడ్నుంచి వస్తున్నాయ్..? ఎవరిస్తున్నారు..? అంటూ విర్రవీగిపోయారు. దీంతో పవన్, జనసేన పార్టీ పోతినను ఎందుకు లైట్ తీసుకుంటోంది..? వ్యక్తిగత విషయాలను టచ్ చేసినప్పటికీ ఎందుకు కనీసం కౌంటర్ ఇవ్వడానికి కూడా సాహసించట్లేదనే ప్రశ్నలు పార్టీ శ్రేణులు సర్వత్రా వస్తున్నాయి. మహేష్ మాటలన్నీ అక్షరాలా నిజమేనా.. అంటే దీనికి పార్టీ అధిష్టానం కనీసం ఓ ప్రకటన అయినా రిలీజ్ చేస్తే సభ్య సమాజానికి, జనసైనికులకు తెలిసే పరిస్థితి ఉంటుంది.
అసలేం జరుగుతోంది..?
ఓ ప్రముఖ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి పవన్‌ను టచ్ చేశారు పోతిన. సినిమాలు చేసి వాటి నుంచి వచ్చిన డబ్బులతో పార్టీని నడిపిస్తున్నానని జనసేననాని చెబుతున్నారు.. దీనికి మీరేమంటారు..? టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలపై మీ దగ్గర ఆధారాలున్నాయా..? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి పోతిన స్పందిస్తూ.. 2014 నుంచి 2024 వరకు పవన్ ఎన్ని సినిమాలు తీశారు..? అందులో ఎన్ని సూపర్, డూపర్ హిట్లు అయ్యాయి..? ఎన్ని డిజాస్టర్లు అయ్యాయి..? పవన్ చేసిన సినిమాలు కనీసం ఆరు కూడా లేవని పోతిన చెప్పుకొచ్చారు. అత్తారింటికి దారేది, గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి, వకీల్‌సాబ్, భీమ్లా నాయక్ .. ఈ సినిమాలు మొత్తానికి రెమ్యునరేషన్‌గా ఆయనకు వచ్చినది ఎంత..? ట్యాక్స్ ఎంత కట్టారు..? పార్టీ కోసం ఖర్చు పెట్టింది ఎంత..? 2014 నుంచి 2024 వరకూ పవన్ కొన్న ఆస్తులు ఎంత..? అనేది త్వరలోనే బయటపెడతానంటూ ఒకింత పోతిన సవాలే చేశారు.
ఎందుకింత మౌనం..?
చూశారు కదా.. మొన్న పవన్ ఫ్యామిలీ గురించి.. ఇప్పుడేమో ఆస్తులు, రెమ్యునరేషన్.. రేపొద్దున ఇంకేం మాట్లాడుతారో అనేది తెలియట్లేదు. ఇంత జరుగుతున్నా పవన్ కానీ.. ఆ పార్టీ నేతలు కానీ ఎందుకు మౌనం పాటిస్తున్నారన్నది పార్టీ శ్రేణులకు అర్థం కాని విషయం. తిన్నింటి వాసాలు లెక్కెట్టడమేంటి..? ఇప్పుడు పవన్‌ను అడుగుతున్నట్లు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డిని ఎందుకు అడగట్లేదు..? అసలు ఇవన్నీ అడగటానికి పోతిన ఏమైనా ఐటీ ఏం కాదు కదా..? ఇప్పుడు ఇన్ని అడుగుతున్న మహేష్‌కు జనసేన పార్టీలో ఉన్నన్ని రోజులు ఎందుకు గుర్తుకు రాలేదు..? ఇలా ఒక్కటంటే ఒక్క ప్రశ్న అయినా జనసేన నుంచి రావొచ్చు కదా..? పోనీ ఒకరు కాదు ఇద్దరు కాదు పవన్‌ను పక్కనెడితే ఇంకో 20 మంది ఎమ్మెల్యే.. ఇద్దరు ఎంపీ అభ్యర్థులు ఉన్నారు కదా..? ఎందుకు కనీసం ఈయనకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు.. కనీసం పోతిన పేరెత్తడానికి కూడా ఎందుకు సాహసం చేయట్లేదన్నది ఎవరికీ అర్థం కాని విషయం. ఇలాగే మౌనంగా ఉంటే.. మున్ముందు మహేష్ ఇంకెన్ని మాటలు మాట్లాడుతారో..? అంటూ జనసైనికులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. వదలనంటున్న పోతినను.. మహేష్ ఇంకా లైట్ తీసుకుంటారా లేకుంటే ఒకే ఒక్క దెబ్బతో అన్నింటికీ సమాధానాలిచ్చేస్తారా అనేది చూడాలి.. జనసైనికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు కూడా..!