తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తున్నాడు.. అవును కచ్చితంగా కాషాయ పార్టీలోకి వెళ్లిపోతారు..! కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకపోతే ఒట్టు..! ఇవీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు నుంచి నేటి వరకూ ఎవరి నోట చూసినా.. ఎక్కడ విన్నా వస్తున్న మాటలు. గల్లీ లీడర్ మొదలుకుని ఢిల్లీ లీడర్ వరకూ ఎవరు చూసినా ఇదే మాటలు మాట్లాడుతున్న పరిస్థితి. ఇక గులాబీ పార్టీ నేతలు అయితే.. మీడియా ముందుకొస్తే చాలు అదిగో రేవంత్ ఎల్లిపోతుండు.. ఇదిగో సర్కార్ కూలిపోతుంది..? ఇవే మాటలతోనే కాలం గడిపేస్తున్నారు. ఇక వీళ్లంతా చాలరన్నట్లు రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన.. ఉద్యమ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నోట కూడా ఇదే మాట వస్తున్నదంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి.. తప్పు తప్పుగా మాట్లాడుతున్నారని అనుకోవాలా..? లేకుంటే రేవంత్‌ను డిఫెండ్ చేయలేక.. మాట్లాడటానికి ఏమీ లేకనే ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అనుకోవాలా..? అనేది అర్థం కాని పరిస్థితి.
ఎక్కడైనా ఉందా..?
నిజంగా ఒక పార్టీ అధ్యక్షుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి.. తనకున్న అన్ని పదవులు వదిలేసుకుని బికారుకా వేరే పార్టీలోకి వెళ్లాలని అనుకుంటారా..? అది కూడా దశాబ్ధం పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌పై కొట్లాడి.. జైలుకెళ్లి.. నానా ఇబ్బందులు పడి.. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి.. వన్ అండ్ ఓన్లీ పార్టీని భుజాలకెత్తుకుని గెలిపించుకున్న రేవంత్‌కు నిజంగా బీజేపీలోకి వెళ్లాల్సినంత అవసరం ఉందా..? అనేది ఒక్కరూ ఆలోచించరేం. పోనీ.. రేవంత్‌పైన కేసులన్నింటిలో కీలకమైనది ఓటుకు నోటు కేసు.. ఈ కేసుతోనే సర్కార్ ఏమైనా కూలుతుందా..? ఏమవుతుంది..? మహా అంటే అరెస్ట్ చేయొచ్చు.. అంతే కదా.. ఆ తర్వాత బెయిల్‌కు అప్లయ్ చేసుకోవడం వారికి తెల్వదా.. బయటికి రావడం ఎలాగో ఎరుక కాదా..? మీడియా గొట్టాల ముందుకొచ్చి, బహిరంగ సభల్లో ఓ.. అని ఊదరగొట్టేముందు ఇవన్నీ తెలుసుకుని ఎందుకు మాట్లాడరనేది ఆశ్చర్యంగా ఉంది.
లోకల్ కాదు నేషనల్!
పోనీ రేవంత్ సీఎం అయ్యింది ప్రాంతీయ పార్టీ తరఫునా అంటే కాదే.. అది జాతీయ పార్టీ.. కొన్ని దశాబ్దాలుగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ తరఫున అనే విషయం కూడా మరిచి మాట్లాడుతున్నారంటే.. దీన్ని అమాయకత్వం అనుకోవాలా..? లేకుంటే ఇలా మాట్లాడే నేతలకు మతి లేదని అనుకోవాలా అనేది వారికే తెలియాలి. బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది.. అధికారంలోకి వచ్చిన అందరికీ తెలిసిందే. పోనీ అలాగనీ తెలంగాణలో కూడా కమలనాథుల ఆటలు సాగుతాయా అంటే.. అవ్వదు కదా.. మ్యాజిక్‌కు ఫిగర్‌కు అటు కానీ.. ఇటుగానీ బీజేపీ లేదే.. ఇలా చేయడానికి కూడా. ఇక ఓ ఇంటర్వ్యూలో మోదీని రేవంత్ పొగిడారని.. ఇదే నిదర్శనం అని చెబుతున్నారు. అంతకుముందు పెద్దన్న అన్నారని కూడా విమర్శలు గుప్పించారు.. అసలు ఏ సందర్భంలో అలా మాట్లాడాల్సి వస్తుందనే విషయం తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా..? ఆ మాటలకు ముందు ఆ తర్వాత ఏముంది..? అనేది కూడా తల, తోక లేకుండా వీడియో క్లిప్పింగ్స్ కట్ చేస్తే సరిపోతుందా..? అర్థమయ్యిందా..? ఇప్పటికైనా జర ఆలోచించి మాట్లాడితే మంచిది సుమీ..!