అవును.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మెగాస్టార్ చిరంజీవి హాట్ టాపిక్ అయ్యారు. చిరు రాజకీయాల్లో ఉన్నా.. లేకున్నా ఆయన పేరు మాత్రం వినిపిస్తూనే ఉంటోంది. నేను రాజకీయాల్లో లేను.. జీవితం అంతా సినిమాలకే అంకింతం అని పదే పదే చెబుతున్నప్పటికీ ఏదో ఒకరకంగా ఆయనతో రాజకీయాల్లో వేలు పెట్టిస్తూనే ఉన్నారు. మొన్న ఆ మధ్య సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశ్వంభర షూటింగ్ దగ్గర కలవడం, చిరు ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించి.. పార్టీకి గాను 5 కోట్ల రూపాయిలు ఫండ్ ఇవ్వడం సంచలనంగానే మారింది. ఇదిగో ఇక తమ్ముడికి సపోర్టుగా అన్నయ్య వచ్చేస్తున్నారంటూ ఓ రేంజ్‌లోనే కథనాలు వచ్చాయి. సీన్ కట్ చేస్తే అది పార్టీ ఫండ్ వరకే పరిమితం అని తేలిపోయింది.
చిరు ఎవరివైపు!
వాస్తవానికి తాను కాంగ్రెస్ నాయకుడేనని.. కాంగ్రెస్ నేతలు కూడా చిరు మా పార్టీ మనిషేనని తెగ చెప్పుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా చింతా మోహన్ లాంటి సీనియర్లు పదే పదే చిరంజీవి గురించి మాట్లాడుతూ తమ పార్టీ నేతేనని బల్ల గుద్ది మరీ చెబుతుంటారు. ప్రస్తుతానికి ఆయన ఏ పార్టీలో లేరనుకోండి.. మొన్న పవన్ కలవడం మెగా ఫ్యామిలీ ఇష్యూ అనుకోండి..! అలాంటిది ఒక్కసారిగా అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి, బిజినెస్‌మెన్ సీఎం రమేష్.. చిరు ఇంట్లో ప్రత్యక్షమవ్వడంతో హాట్ టాపిక్ అయ్యింది. ప్రజారాజ్యం, కాంగ్రెస్ ఈ రెండు పోయి.. ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి సపోర్టు చేస్తున్నారా..? అని మెగాభిమానులే ఒకింత ఆశ్చర్యపోయిన పరిస్థితి. దీంతో ఇప్పుడు చిరు ఎవరివైపు..? ఏ పార్టీకి మద్దతిస్తున్నారు..? అనేది పెద్ద సస్పెన్స్‌గానే మారింది.
పార్టీనా.. వ్యక్తా..?
వాస్తవానికి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత చిరును కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఎక్కడా ఏ పార్టీకి సపోర్టు చేసిన దాఖలాల్లేవ్. ఎలాగంటే.. తన సోదరుడు పవన్‌ను ఆశీర్వదించి.. చెక్ ఇచ్చారే గానీ తాను జనసేనకు సపోర్టు చేస్తున్నట్లు ఎక్కడా ప్రకటించనే లేదు. ఆ తర్వాత ట్వీట్ చేసినప్పటికీ అందులోనూ జనసేన గెలవాలని కానీ.. జనసేనకు సపోర్టు చేస్తున్నట్లుగానీ ప్రకటించలేదు. ఇక ఇప్పుడు సీఎం రమేష్ కలిశాక.. ఆయన్ను ఆశీర్వదించారే తప్ప ఎక్కడా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారని.. గెలిపించాలని ప్రజలకు కానీ.. తన అభిమానులకు కానీ సందేశం పంపలేదు. అయితే.. వ్యక్తిగతంగా తన మద్దతు రమేష్‌కు ఉంటుందని.. గెలవాలని కోరుకుంటున్నానని ప్రజలకు ఆయన వల్ల మంచి జరగాలని మాత్రమే ఆకాంక్షించారు. దీన్ని బట్టి చూస్తే.. క్లియర్ కట్‌గా అర్థమైంది కదా.. చిరు ఎక్కడా ఏ పార్టీకి మద్దతివ్వలేదనే విషయం. ఇప్పటి వరకూ ఓకే కానీ.. చిరు ఆశీస్సులు కూటమికి చెందిన వ్యక్తులకేనా..? లేకుంటే వైసీపీలో కూడా చాలా మందే కావాల్సిన వాళ్లు, వీరాభిమానులు కూడా ఉన్నారు..? వారికి కూడా ఆశీస్సులు ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వారంతా వచ్చి చిరును కలిస్తే మాత్రం పవన్ పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన మాత్రం మెగాభిమానుల్లో గట్టిగానే ఉంది.