ఆంధ్రప్రదేశ్‌లో నిజంగానే ఎన్నికలు జరుగుతున్నాయా..? అంటే అబ్బే అస్సలు లేదండోయ్ అనే మాటలే వినిపిస్తున్నాయ్.! ఎందుకంటే.. ఇప్పుడంతా రాళ్ల చుట్టూనే రాజకీయాలు జరుగుతున్నాయ్. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డిపై అనంతపురం జిల్లా వేదికగా చెప్పుతో దాడి చేసిన ఘటనతో మొదలై.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ పార్టీ అధినేతపై చూసినా రాళ్లతోనే దాడులు జరుగుతున్నాయ్. దీంతో రాళ్లతోనే.. రాళ్లపైనే.. రాళ్లే రాజకీయాలుగా మారిపోయాయి.! బహుశా ఇలాంటి ఘటనలు జరగడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే మొదటిసారైనా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..!
అసలేం జరుగుతోంది..?
మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్‌కు రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఎలాంటి ఆదరణ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక గుంటూరులో కూడా ప్రశాంతంగానే సాగింది. విజయవాడలోకి వచ్చేసరికి అనూహ్యంగా రాళ్ల దాడి జరగడం ఒక్కసారిగా రాజకీయ నేతలు షాకయ్యారు. ఎందుకంటే.. దాడి జరిగింది సామాన్యుడిపైన కాదు.. సీఎం జగన్‌పై.. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమయ్యాయి..? అసలు డీజీపీ ఉన్నారా లేరా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇంత భద్రత మధ్య రాళ్ల దాడి జరిగిందంటే.. అస్సలు నమ్మశక్యం కావట్లేదని ప్రతిపక్షాలు చెబుతుంటే.. గత ఎన్నికల ముందు కోడికత్తి వ్యవహారాన్ని గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. ఈ దాడి చేపించుకున్నారా..? లేకుంటే ప్రత్యర్థి పార్టీ వారే చేయించారా..? ఇవన్నీ కాదని కడుపు మండి సామాన్యుడే ఇలా చేశాడా..? అనేది ఇంకా తేలట్లేదు. సీఎంపైన దాడి జరిగితే నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ఇన్ని రోజులు సమయం తీసుకుంటూ ఉండటం గమనార్హం. దీనికి తోడు నిందితులను పట్టిస్తే భారీగా నజరానా ఇస్తామని ప్రకటించడం ఇంతకంటే సిగ్గుచేటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరుస దాడులెందుకు..?
జగన్‌పై దాడి జరిగిన ఒక్కరోజు గ్యాప్‌లోనే టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఇలాగే రాళ్లతో దాడికి యత్నించడం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియని పరిస్థితి. జగన్‌కు ఎంతటి సెక్యూరిటీ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటి వ్యక్తిపైనే దాడి జరిగిందంటే.. ఇక చంద్రబాబు, పవన్‌లపై దాడికి యత్నించడంలో ఆశ్చర్యమేముంది..? అనేది ఆ పార్టీల నేతల నుంచి వస్తున్న ప్రశ్నలు. ఆఖరికి ఇకపై ఏపీలో ఎవరు ఎన్నికల ప్రచారం చేయాలన్నా వారి పార్టీ గుర్తులు, పేర్లతో కూడిన హెల్మెట్లు వాడాల్సిందేనని ట్రోలింగ్స్.. సెటైర్లు వినిపిస్తున్నాయంటే ఏపీ రాజకీయాలు ఎక్కడ్నుంచి ఎక్కడికి దిగజారుతున్నాయో.. ఇంకా ఎక్కడికి దిగజారిపోతాయో ఏంటో మరి.
ఎందుకీ రచ్చ.. దాడులు!
జగన్‌పై దాడి ఎవరూ చేయలేదని తనకు తానే చేయించుకున్నారనే విమర్శలు మాత్రం ఓ రేంజ్‌లోనే ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఇదే నిజమనుకుంటే అలాగే దాడి చేయించుకుని చంద్రబాబో.. లేకుంటే పవనో సీఎం కావొచ్చు కదా..? అనేది వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న. ఇక ఇదే క్రమంలో పవన్, చంద్రబాబులపై దాడి జరగడంతో ఇది కూడా మీరే చేయించుకున్నారా ఏంటనే ప్రశ్నలకు ఇక్కడ్నుంచి సౌండ్ అస్సలు లేదు. జగన్‌పై జరిగిన దాడిని డైవర్ట్ చేయడానికి ఇలా ఇష్టానుసారం మాట్లాడి.. రాళ్లతో తగిలీ తగలక దాడులు చేయించుకుంటున్నారో.. లేకుంటే నిజంగానే తమ నేతపై దాడులు చేయిస్తారా అని ఆగ్రహంతో ఎవరైనా ఇలా చేస్తున్నారా..? అనేది నిగ్గు తేలని పరిస్థితి. పైగా ఎవరికి అనుకూలంగా వారి దినపత్రికలు, టీవీ చానెల్స్‌లో అబ్బో.. ఆహా.. ఓహో అని రాయించేసుకుంటున్నారు. ఇవన్నీ ప్రజలు మాత్రం క్లియర్ కట్‌గా గమనిస్తూనే ఉన్నారు కదా.. ఎవరికి పట్టం కడుతారో.. ఎవర్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారో చూద్దాం మరి.