ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమరం లో రాజకీయపార్టీలు ప్రజలని ఆకట్టుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. కూటమితో ముందుకు వెళుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ లు కలిసి ఉమ్మడి సభలు సమావేశాలు నిర్వహిస్తుంటే.. వైస్ జగన్ సిద్ధం అంటూ బస్సు యాత్ర చేపట్టారు. అయితే నిన్న సోమవారం విజయవాడలో జగన్ బస్సు యాత్రలో అతనిపై జరిగిన రాళ్ల దాడికన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో టీడీపీ-వైసీపీ నేతల మాటల యుద్ధం హైలెట్ అయ్యింది.
జగన్ పై ఎవరు రాయి విసిరారో అనేది ఇంకా కనిపెట్టకముందే ఈరోజు తెనాలిలో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ పై దుండగులు రాళ్ళు విసరడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే పవన్ కల్యాణ్ కు తగలకుండా రాయి దూరం పడడంతో జనసైనికులు ఊపిరి పీల్చుకున్నారు. రాయి విసిరిన వ్యక్తిని పట్టుకొని జన సైనికులు పోలీసులకు అప్పగించారు.
అది ఇంకా చల్లారకముందే టీడీపీ అధినేత చంద్రబాబుపై కొంతమంది రాళ్ళు విసిరిన ఘటన గాజువాకలో చంద్రబాబు సభలో కలకలం సృష్టించింది. చంద్రబాబు సభలో మట్లాడుతూ ఉండగా.. చంద్రబాబు సమీపంలో కొన్ని రాళ్లు వచ్చి పడ్డాయి, ఆయనపై రాళ్లు విసిరి పరారైన గుర్తుతెలియని వ్యక్తులు. టీడీపీ కార్యకర్తలు పట్టుకునేలోగా పరారైన నిందితులు.
తనపై రాళ్లు విసరడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతేకాదు.. రాళ్లు వేసిన వారిని చంద్రబాబు హెచ్చరించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని చంద్రబాబు తెగేసి చెప్పారు. చంద్రబాబుపై రాళ్లు విసరడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైనారు.