ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత ఆసక్తికరంగా సాగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రత్యర్థి కూటమి ఒక్కటే కాదు.. సొంత చెల్లెళ్ళు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఢీ కొడుతున్నారు. అసలు జగన్ అనే పేరును బద్నాం చేయడానికి చేయాల్సిన భగీరథ ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇంత జరుగుతన్నా జగన్ మాత్రం చెల్లెళ్ళ పేర్లు కూడా పలకడానికి కనీసం పలకట్లేదు. అంటే ఈ ఇద్దరినీ.. జగన్ ఎలా చూస్తున్నారు అనేది ఇంతకుమించి చెప్పక్కర్లేదు. ఇక అసలు విషయానికొస్తే.. జనం కోసం, రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న జగన్ తన సొంత నియోజవర్గమైన పులివెందులకు పట్టించుకోవడం లేదు. పులివెందులను పూర్తిగా సతీమణి వైఎస్ భారతికే అప్పగించారు.
వదిన Vs ఆడపడుచు!
కాంగ్రెస్ పార్టీని ఈ పరిస్థితికి తెచ్చిన వైఎస్ జగన్ రెడ్డిని సొంత జిల్లాలో గట్టి దెబ్బ కొట్టాలన్నది అధిష్ఠానం టార్గెట్. అందుకే వైఎస్ ఫ్యామిలీని రెండుగా చీల్చి రాజకీయం చేస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు కట్టబెట్టి.. కడప ఎంపీగా షర్మిలను బరిలోకి దింపింది. దీంతో కడప, రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ప్రచారంలో భాగంగా జగన్, వైసీపీని ఒక రేంజులో ఏకిపారేస్తున్నారు. చిన్నాన్న వైఎస్ వివేకాను చంపిన హంతకుడిపై పోటీ చేస్తున్నా అని.. ధర్మం వైపు నిలబడాలని కొంగుచాచి మరీ ఓట్లు అడుగుతున్నారు షర్మిల. కాసేపు అటు ఉంచితే.. ఇక అతి త్వరలోనే వైఎస్ భారతి రంగంలోకి దిగబోతున్నారు. పులివెందులలో జగన్ భారీ విజయం, మెజారిటీ సంగతి భారతికి వదిలేశారు సీఎం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు వదిన వర్సెస్ ఆడపడుచుగా పరిస్థితులు నెలకొన్నాయి.
బదులు ఉంటుందా..!!
ఎన్నికల ప్రచారంలో ప్రతీసారి జగన్ రెడ్డిని ఎలా మాట్లాడుతున్నారో అందరం చూస్తూనే ఉన్నాం. అభివృద్ధి లేదు, వారసుడు కాదు.. హంతకులను వెనకేసుకొని వస్తున్నారని పెద్ద పెద్ద మాటలే షర్మిల మాట్లాడుతున్నారు. వీటన్నిటికీ భారతి బదులిస్తారా.. లేదా అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి అన్నకు..చెల్లికి గొడవలు జరగడానికి కర్త, ఖర్మ, క్రియ అన్నీ భారతి అని టాక్ గట్టిగానే నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ వర్సెస్ కాబోతున్నారు. దీంతో ఎవరేం మాట్లాడుతారు..? కౌంటర్లు, పంచ్ డైలాగులు ఎలా ఉంటాయో అని జనాలు ఎదురు చూస్తున్నారు.
పరువు నిలబెడుతుందా..!!
వైఎస్ఆర్ మరణం తర్వాత పులివెందులను తన కంచుకోటగా మార్చుకున్నారు. 2014లో 75,243 ఓట్లు.. 2019లో 90,110 ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. వైఎస్ ఉన్నప్పటి నుంచి.. తాను చనిపోయే ముందు వరకూ కడప జిల్లాకు అన్నీతానై వైఎస్ వివేకా
చూస్కున్నారు. ఇప్పుడు ఆయన లేరు.. ఆయన ఫ్యామిలీ జగన్ రెడ్డికి పూర్తి వ్యతిరేకంగా నడుస్తోంది. వారికి తోడు సొంత చెల్లి షర్మిల కూడా తోడయ్యారు. ఇప్పుడు వివేకా స్థానాన్ని.. బాధ్యతలను పూర్తిగా భారతీకే అప్పగించారు జగన్. ఇప్పుడు పులివెందులలో జగన్ మెజారిటీ పరువు కాపాడాల్సిన బాధ్యత భారతి పైన ఉంది. మెజారిటీ ఎన్నికలు.. ఎన్నికలకు పెరుగుతూనే వస్తోంది.. ఈసారి కనీసం లక్ష ఐనా కొడితే కానీ పరువు ఉండదు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. జగన్ కూడా ఇదే మాట చెప్పి జనంలోకి భారతిని పులివెందులకు పంపుతున్నారట. అంతే కాదు ఇది వరకు బాబాయ్ జిల్లా మొత్తం చూసినట్లుగా ఎలాంటి పొరపచ్చాలు రాకుండా చూడాలని కూడా ఆదేశించారని ప్రచారం జరుగుతోంది. అంటే.. పులివెందులతో పాటు ఉమ్మడి కడప జిల్లా బాధ్యతలను పూర్తిగా సతీమణి భారతికే కట్టబెట్టారన్న మాట.
ఏప్రిల్ 22న పులివెందులలో జగన్ నామినేషన్ వేయనున్నారు. ఆ మరుసటి రోజు నుంచే ప్రచారంలోకి భారతి వెళ్లనున్నారు. జగన్ పరువు భారతి ఏ మాత్రం కాపాడుతుంది అనేది జూన్ - 04 న తెలుస్తుంది మరి.