అవును.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనమే చోటుచేసుకుందని చెప్పుకోవచ్చు.!. అందరికంటే ముందుగా ఒకేసారి 175 మంది అసెంబ్లీ, 25 మంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారిగా ఊహించని మార్పులు, చేర్పులు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదెలాగంటే.. ఈ విషయం తెలిసిన జనాలు, సొంత పార్టీ నేతలు వామ్మో.. ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారేంటబ్బా అని ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితట. ఇంతకీ ఏమిటా ట్విస్ట్.. ఏం జరిగింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఎక్స్‌క్లూజివ్‌గా తెలుసుకుందాం వచ్చేయండి..!
ఇదీ అసలు కథ!
వైసీపీ వర్గాల నుంచి వస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇద్దరు ఎంపీ అభ్యర్థులను మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిన్నగాక మొన్న జనసేనకు గుడ్ బై చెప్పేసి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న వ్యక్తికి కూడా టికెట్ దక్కడం గమనార్హం. వసంత కృష్ణప్రసాద్‌కు వైసీపీ టికెట్ దక్కకపోవడంతో ఆ సీటును సామాన్యుడైన తిరుపతిరావుకు వైఎస్ జగన్ కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్యాప్‌లో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. ఆయన్ను పక్కనెట్టేసి మైలవరం అభ్యర్థిగా మంత్రి జోగి రమేష్‌ను బరిలోకి దింపుతున్నారట. అయితే పెడన అభ్యర్థిగా జోగి స్థానంలో ఎవరు అన్నది తెలియట్లేదు. ఒకవేళ అటు ఇటు మార్పులు జరుగుతాయా లేకుంటే.. కొత్త అభ్యర్థి బరిలోకి దిగుతున్నారా అనేది తెలియట్లేదు.
అటు చేరిక.. ఇటు టికెట్!
పోతిన మహేశ్.. ఇటీవల జనసేనకు గుడ్ బై చెప్పేసి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలే చేసి బయటికొచ్చారు. ఈయన విజయవాడ పశ్చిమ టికెట్ ఆశించి భంగపడి బయటికొచ్చేశారు. అయితే వైసీపీ నుంచి అదే స్థానాన్ని కేటాయించడానికి జగన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇక్కడ ప్రస్తుతం వైఎసీపీ అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ ఉన్నారు. పోతినకు టికెట్ ఇస్తే.. ఆసిఫ్ పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి పోతినకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో మొదట్నుంచీ టికెట్ కోసం జనసేనలో పట్టుబట్టారు. అయితే.. అటు నుంచి ఇటు వచ్చిన తర్వాత ఇంకాస్త కలిసొస్తుందని.. కచ్చితంగా కూటమి అభ్యర్థి సుజనా చౌదరిపై గెలుస్తారని తేలడంతో పోతినకే టికెట్ ఇవ్వాలని జగన్ ప్లాన్ చేస్తున్నారట.
ఇది అసలు సిసలు ట్విస్ట్!
వైఎస్ జగన్ ఇలాకా, కడప జిల్లాలోని కీలక పార్లమెంట్ స్థానమైన కడప నుంచి కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా అభ్యర్థిగా ప్రకటన వచ్చిందో లేదో.. ఇలా వైసీపీ, వైఎస్ జగన్.. ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిపై ఓ రేంజ్‌లో దుమ్మురేపే ప్రసంగంతో వణుకుపుట్టిస్తున్నారు. పైగా మాజీ మంత్రి వివేకా హత్యకేసులో వైఎస్ అవినాష్ నిందితుడిగా ఉండటంతో ఓ ఆటాడుకుంటున్నారు షర్మిల. దీంతో ఎన్నికల ముందే ఓటమిని పసిగట్టిన జగన్.. ఆ స్థానానికి అభిషేక్ రెడ్డి పేరును ఖారారు చేసి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
మేడమ్ మారుతున్నారట!
గుంటూరు వెస్ట్ నుంచి పోటీచేస్తున్న మంత్రి, విడదల రజినీ స్థానం మారుతున్నట్లుగా తెలుస్తోంది. స్థానం ఒక్కటే కాదండోయ్.. ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. గుంటూరు వైసీపీ ఎంపీగా బరిలోకి దింపడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఎంపీగా ఇదివరకు ప్రకటించిన కిలారి రోశయ్యను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయించడానికి రంగం సిద్ధం చేస్తున్నారట జగన్. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీన్ని చాలా పెద్ద ట్విస్ట్ అంటూ టీడీపీ కార్యకర్తలు, కొందరు నేతలు సైతం తెగ షేర్ చేస్తున్నారు. ఈ మధ్య ఒకరిపై ఒకరు ఫేక్ న్యూస్ సృష్టించుకోవడం.. అటు వైసీపీకి.. ఇటు టీడీపీకి షరామామూలై పోయింది. మరీ ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని చానెళ్ల పేరిట కూడా బ్రేకింగ్స్ మార్చేస్తూ.. వైసీపీ వైరల్ చేస్తుండటం గమనార్హం. అందుకే ఇలా కౌంటర్‌గా టీడీపీ ప్లాన్ చేసిందనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది. ఇందులో నిజానిజాలెంత అనేది వైసీపీనే తేల్చి చెప్పాలి మరి.