ఈ భూమి మీద పుట్టే ప్రతి జీవి.. ఈ భూమి నా సొంతం అనుకుంటుంది.. కానీ ఆ జీవికి తెలియదు ఈ భూమికే ఆ జీవి సొంతమని. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. విన్నా , వినకపోయినా.. ఇది సత్యం. నేను భూమికి సొంతమో కాదో అనేది సెకండరీ.. ఈ భూమి మీద ఎంతకాలం ఉంటామో తెలియదు.. ఉన్నంతకాలం ఎంజాయ్ చేయడమే అని భావిస్తోందీ జీవి. ఎవరా జీవి అనుకుంటున్నారా.. ఇంకెవరు ఆర్ జీవి. ఒకప్పుడు ఈ జీవి గురించి కథకథలుగా చెప్పుకునేవారు. ఇప్పుడూ చెప్పుకుంటున్నారు.. కానీ అప్పుడు వేరు. ఇప్పుడు వేరు. అప్పుడంతా గౌరవంతో కూడిన వినయంతో వచ్చే భక్తితో ఈ జీవిని చూస్తే.. ఇప్పుడంతా క్రియేటివ్ ముసుగులో ఉన్న కామ పిశాచిలా చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన నడవడిక, తీరుతెన్నులు అలా ఉన్నాయ్ మరి.
నలుగురిలా నేను బతకను.. నాకు ఇష్టం వచ్చినట్టుగా బతుకుతా.. ఐ డోంట్ కేర్ అనేదే ఇప్పుడీ జీవి ఫార్ములా. ఈ ఫార్ములాని నమ్ముకునే రోజుకో ఫిగర్ అన్నట్లుగా ఆర్ జీవి ఎంజాయ్ చేస్తున్నాడు. కాంట్రవర్సీని కేరాఫ్ అడ్డాగా మార్చుకుని.. దానికి ఆర్‌జీవి డెన్‌ని అధిపతిని చేశాడు. ఈ డెన్‌ని కనుక తోడితే.. ఇండియా ఆశ్చర్యపోయే విషయాలు బయటికి వస్తాయి. ఇప్పుడంత సాహసం చేసేంత టైమ్ ఎవరికీ లేదులే కానీ.. ఈ క్రియేటివ్ కాంట్రవర్సీ జీనియస్.. ఈ భూమి మీద అడుగు పెట్టినరోజు నేడు. మాట తప్పడం, మడమ తిప్పడం బ్యాచ్‌కి మార్గాన్వేషిగా మారిన ఈ రసిక రాజాకి బర్త్‌డే విశెస్ చెప్పడం లేదులే కానీ.. (ఎందుకంటే బర్త్‌డేపై కూడా ఆయనకి సదాభిప్రాయం లేదు కాబట్టి), కాస్త మార్పు వచ్చిందిలే అనుకున్న ప్రతిసారి.. తనెంత దిగజారుతున్నాడో చెప్పే ప్రయత్నమే ఇది.
అరె.. నిన్న శనివారం.. అందరినీ ఒక్క మాటతో ఏప్రిల్ ఫూల్స్‌ని చేశాడంటే.. ఆయన ఈడుస్తున్న బతుకెలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్నటువంటి రాజకీయ సినిమాల జోలికి ఇక పోడట. ఇంతకు ముందు మెగా ఫ్యామిలీ హీరోలను టచ్ చేయనని చెప్పిన ఈ ఘటికుడు.. మాట మీద నిలబడినట్టు చరిత్రలో లేదు. అలాంటిది ఇప్పుడు సడెన్‌గా అందరిచేత.. మీరు మారిపోయార్ సార్.. అని అనిపించుకోవాలనేలా ప్రయత్నించడం చూస్తుంటే.. ఆయనని ఆయనే ఫూల్‌ని చేసుకున్నాడా? అని అనిపిస్తోంది. ఎందుకంటే అదే ఆర్ జీవి స్పెషాలిటి.
ఒకప్పుడు తనలో ఉన్న క్రియేటివిటీని కాంట్రవర్సీగా మార్చి.. దానితోనే తకిట తకిట తందాన అంటూ నాట్యం చేస్తున్న ఈ మహామేధావి (ఆయన, ఆయన చుట్టూ ఉన్న కొంత మంది అనుకుంటూ ఉంటారులే).. కాంట్రవర్సీ సినిమాలను వదిలేశానని చెబితే.. ఆయన తలలో ఉన్న బుర్ర కూడా నమ్మదు. ఇదంతా వివేకంతో వచ్చిన మార్పు అని భావించాలా? ఇకపై రాజకీయ కాంట్రవర్సీ సినిమాలు తనని పోషించలేవని ఫిక్సయ్యాడా? ఎందుకంటే, వివేకంతో వీర కాంట్రవర్సీలను కోరుకునే వారికి ఫీజులు ఎగిరిపోయాయ్ మరి. అందుకే వర్మ ఇప్పుడో కొత్త స్కెచ్‌కి తెరలేపాడు. ప్రజాస్వామ్యం అనే అర్థం వచ్చేలా.. యువర్ ఫిల్మ్ అంటూ వర్మ తెరతీసిన ఈ కొత్త స్కెచ్ ఎంత వరకు దారి తీస్తుందో. వర్మకి ఇంకెంత ఎనర్జీ ఇస్తుందో? ఇంకెంత మంది కాళ్ల ముందు కూర్చునే అవకాశం ఆయనకి కల్పిస్తుందో.. చూడాలి మరి.