అవును.. అదేదో సినిమా డైలాగ్ ఉంటుందే.. శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టూ.. మన ఇంట్లోనే ఉంటారంటారే.. సరిగ్గా ఇప్పుడు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే. ఏ నిమిషాన వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందో అప్పట్నుంచి జగన్‌కు కంటి మీద నిద్ర కరువైంది. మొత్తం చేసింది కుటుంబ సభ్యులేనని తేలిపోగా.. దీని వెనుక ఉన్నది వైఎస్ జగన్, వైఎస్ భారతీ అని ప్రతిపక్షాలు మాత్రం పెద్దఎత్తునే ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఘటన జరిగి ఐదేళ్లు గడిచినప్పటికీ ఇంతవరకూ లెక్క తేలలేదు.. కేసు కొలిక్కి వచ్చే అవకాశాలు ఇప్పట్లో అయితే కనిపించట్లేదు. సీబీఐని జగనే అడ్డుకుంటున్నాడని టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది. గత ఎన్నికల్లో జరిగిన ఈ ఘటన వైసీపీకి పెద్ద ప్లస్ పాయింట్‌గానే మారింది కానీ.. ఈ ఎన్నికల్లో మాత్రం అతిపెద్ద మైనస్ కాబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
అసలేం జరుగుతోంది..?
రెండోసారి అధికారం దక్కించుకోవాలని అహర్నిశలు శ్రమిస్తున్న వైఎస్ జగన్‌కు అడుగడుగునా కుటుంబ సభ్యులే బ్రేకులు వేస్తున్నారు. సొంత కుటుంబీకులే శత్రువులయ్యారు. తన తండ్రిని చంపిన వారిని.. తెరవెనుక ఉన్నోళ్ల భరతం పట్టాలని వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి శపథం చేసి కూర్చుంది. మీడియా ముందుకొస్తే చాలు.. వైసీపీనే కాదు.. వైఎస్ జగన్‌ను కూడా ఓడించాలని రాష్ట్ర ప్రజలకు చెబుతూ వస్తున్నారు. వాస్తవానికి సునీత ఈ ఎన్నికల్లో పోటీచేస్తారని భావించినప్పటికీ ఎందుకో అది జరగలేదు. తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు.. వైఎస్ జగన్ రెడ్డిపై పులివెందుల నుంచి వివేకా భార్య సౌభాగ్యమ్మ పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగుతారని దాదాపు క్లారిటీ వచ్చేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. మొదట్నుంచీ వైఎస్ వివేకా హత్య వెనుక జగన్ హస్తం ఉందన్నది కుటుంబ సభ్యుల ప్రధాన ఆరోపణ. అందుకే జగన్‌ను ఓడిస్తే అన్నీ తెలిసొస్తాయని ఇలా పోటీకి దిగుతున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన వస్తే కానీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
ఇప్పటికే ఇలా..!
వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి కడప నుంచి ఎంపీగా పోటీచేస్తుండగా.. ఇతనిపై వైఎస్ షర్మిల కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అవినాష్‌ను ఓడించాలన్నదే షర్మిల టార్గెట్. ఇప్పటికే అవినాష్, జగన్ టార్గెట్‌గా మాటల తూటాలు పేలుస్తున్నారు. పైగా హంతకులను చట్టసభల్లోకి ఎలా పంపుతారు..? సొంత చిన్నాన్ననే చంపినోళ్లు రేపొద్దున్నే ఎవరినైనా చంపడానికి వెనుకాడరనే ఒక నినాదాన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. పైగా ఎన్నికల ప్రచారంలో షర్మిల పక్కనే సునీతారెడ్డి కూడా ఉంటున్నారు. ఈ పోటీతోనే జగన్ నానా తంటాలు పడుతుండగా.. ఇప్పుడు ఆయనపైనే సొంత కుటుంబ మనిషి పోటీ చేస్తుండటంతో పెద్ద తలనొప్పే వచ్చి పడినట్లయ్యింది. చూశారు కదా.. ఒకే ఒక్క ఇన్సిడెంట్ సొంత కుటుంబీకులనే ఎలా శత్రువులుగా మార్చిందో. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్నది జగమెరిగిన సత్యమే. మరి ఏం జరుగుతుందో.. ఈ ఎన్నికల్లో అటు అవినాష్.. ఇటు జగన్ పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది జూన్-04న తేలిపోనుంది.