ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు..? రాష్ట్రాభివృద్ధి కోరుకుంటున్నారా..? సంక్షేమం మాత్రమే కావాలనుకుంటున్నారా..? ఇప్పుడిదే అధికార, ప్రతిపక్ష పార్టీలను వెంటాడుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. ఏపీలో పార్టీలు ఎన్ని ఉన్నా.. కూటమిలో ఎన్ని పార్టీలొచ్చి చేరినా టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్యే పోటీ అనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇందులో చంద్రబాబు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అయితే.. వైఎస్ జగన్ మాత్రం సంక్షేమ సారథిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఏపీ ప్రజలు ఇద్దరిలో ఎవరిని సీఎం పీఠమెక్కిస్తారు..? అనేది అంతుచిక్కట్లేదు. అయితే.. రాజకీయ విశ్లేషకులు, ప్రజల నాడి తెలిసిన కొందరు నిపుణులు చెబుతున్న మాటల ప్రకారం ఏపీ ఓటర్లు రెండుగా చీలిపోయారట. దీంతో సంక్షేమం వర్సెస్ అభివృద్ధిగా పరిస్థితులు మారిపోయాయట.
ఏం జరుగుతోంది..?
ఏ రాష్ట్రంలో అయినా సరే.. ఎన్నికలు వస్తే చాలు ప్రజలు ఏం ఆలోచిస్తారనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారు..? ఎవరి సంక్షేమ బాటలో ప్రజలను నడిపిస్తారు..? ఈ రెండే.. ఇందులో అభివృద్ధి అంటే టక్కున గుర్తొచ్చేది చంద్రబాబే ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేశారో.. ఎన్నెన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారో అందరికీ బాగానే గుర్తుండే ఉంటుంది. ఇక సంక్షేమం అంటే తడుముకోకుండా.. వేరే ఆలోచనే లేకుండా జగన్‌నే ప్రజలు గుర్తుతెచ్చుకుంటారు. ఈ ఐదేళ్ల కాలంలో సంక్షేమం అనే పదానికి నిలువెత్తు నిదర్శనంలాగా జగన్ పాలన సాగిందన్నది రాజకీయ విశ్లేషకులు, రాష్ట్ర ప్రజలు కొందరు చెబుతున్న మాట. దీంతో జగన్ వల్ల లబ్ధి పొందిన, సంక్షేమ పథకాలు వచ్చిన వారు కళ్లు మూసుకుని జగన్‌ను గెలిపించడానికి రెడీగానే ఉన్నారు. ఇక ఐదేళ్ల పాలనలో అభివృద్ధి అంటే పెద్దగా సాధించేది ఏమీ లేదనే చెప్పుకోవాలి. ఈ రకంగా చెప్పుకుంటే చంద్రబాబుకు బాగా ప్లస్ అవుతుంది.
యువత మనసులో ఏముంది..?
ఇక ఆ రెండు విషయాలను అటుంచితే.. సామాజిక వర్గాల కంటే యువత ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఐదేళ్ల కాలంలో ఉద్యోగాలు ఏ మాత్రం వచ్చాయి..? ప్రభుత్వం రిలీజ్ చేసిన నోటిఫికేషన్లు ఎన్ని..? అని మాత్రం కచ్చితంగా యూత్ ఆలోచిస్తుంది. ఈ లెక్కన అయితే నిరుద్యోగులు, యువకులు వైసీపీకి ఓటేసేందుకు కచ్చితంగా ఆలోచిస్తారు. ఇంకాస్త లోతుగా వెళ్తే చదువుకున్నోళ్లు.. కాస్త రాజకీయాల గురించి తెలిసన వారు అభివృద్ధి గురించి కచ్చితంగా ఆలోచిస్తారు. ఇదే జరిగితే టీడీపీకి ఎలాంటి డోకా ఉండదు. అలాగనీ ఈ ఐదేళ్ల కాలంలో అభివృద్ధి అస్సలే జరగలేదా అంటే జరిగింది. కాస్తో కూస్తో అభివృద్ధి జరిగినా ఒక్కసారి ఇచ్చిన చాన్స్‌కు జగన్ న్యాయం చేశారని కూడా ఓ వర్గం ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇక చంద్రబాబు అంటారా.. ఈ ఎన్నికల్లో కూటమి కట్టడమే పెద్ద మైనస్‌గా మారింది. ఏపీలో బీజేపీపై ఎంత వ్యతిరేకత ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఎన్డీఏ చేసిన కొన్ని నిర్ణయాలు ముస్లిం ఓటర్లను దూరం చేస్తోంది. ఈ మధ్య చంద్రబాబు నోరు జారుతున్న కొన్ని మాటలు కూడా బూమారాంగ్ అవుతున్న పరిస్థితి. పెన్షన్ల విషయంలో ఈసీకి ఫిర్యాదు చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. ఇలా ఒకటా రెండా చంద్రబాబుకు చాలానే మైనస్‌లు ఉన్నాయని చెప్పుకోవచ్చు.
కిక్కే కానీ..!
ఇక నియోజకవర్గాల్లో, జిల్లా స్థాయిలో ఎవరు సభలు పెట్టినా.. చంద్రబాబు ప్రజాగళం నిర్వహించినా.. మేమంతా సిద్ధమంటూ వైఎస్ జగన్ సభలు పెట్టినా.. వారాహీ యాత్ర అంటూ ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ కోసం వేలాదిగా.. లక్షలాదిగా ఇసుకేస్తే రాలనంతగా జనాలు వచ్చేస్తున్నారు. ఇందులో గట్టిగానే గ్రాఫిక్స్ కూడా ఉన్నాయ్. ఇది అందరికీ కిక్కే కానీ.. ఎంతవరకూ అనేది తెలియట్లేదు. దీంతో అసలు ఏపీ ప్రజలు ఎటు ఉన్నారు..? ఏ పార్టీ పక్షాన నిలుస్తారు..? అనేది అర్థం కావట్లేదు. చూశారుగా.. ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇక సర్వేలు అంటారా.. దాదాపు అన్నీ వైసీపీకే ప్రజలు మళ్లీ పట్టం కట్టబోతున్నారని తేల్చి చెబుతున్నప్పటికీ.. కూటమి మాత్రం గట్టిగా ధీమాతోనే ఉంది. మొత్తానికి చూస్తే.. ఏపీ ప్రజల మూడ్ ఎలా ఉంది..? ఎటువైపు నిలబడతారు..? అనేది మే-13న కాస్త తెలిస్తే.. ఆ తర్వాత జూన్-04న మధ్యాహ్నం కల్లా ఫుల్ క్లారిటీ వచ్చేయనుంది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం మరి.