ఉద్యమ పార్టీ.. ప్రత్యేక తెలంగాణను సాధించి.. రాష్ట్ర ప్రజల మనసు గెలిచి పదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్. ఇన్నాళ్లు మనం చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అన్నట్లుగా పాలన చేస్తూ వచ్చారు కేసీఆర్. అలా పార్టీ స్థాపన మొదలుకుని నిన్న మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకూ ఎదురు అనేది లేకుండానే చక్రం తిప్పుకుంటూ వచ్చారు చంద్రశేఖర రావు. సీన్ కట్ చేస్తే ఒక్కసారిగా పార్టీ పేకమేడలా కూలిపోతూ.. ఎక్కడ చూసినా కారుకు పంక్చర్లే.. యాక్సిడెంట్లే.. అంతకుమించి అధినేతకు అనారోగ్యం.. అసలు రిపేరు చేసినా ఫలితం లేదన్న పరిస్థితికి వచ్చింది. ఓ వైపు ఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో ఓడిపోవడం.. మరోవైపు సిట్టింగులు కారు దిగెళ్లిపోవడం.. ఇంకోవైపు కవిత అరెస్ట్.. ఇవన్నీ పార్టీ పరువును మరింత దిగజార్చేశాయి. ఎవరి నోట విన్నా.. ఎలా ఉండే పార్టీ ఇలా తయారయ్యిందేంటి..? అనే మాటే. బీఆర్ఎస్‌కు ఈ గతి పట్టడానికి కారణాలేంటా అని ఆరాతీస్తే షాకింగ్ విషయాలు సారుకు తెలిసొచ్చాయట.
అసలు సంగతి ఇదే..!
తెలంగాణ సెంటిమెంట్‌గా పుట్టిన టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన నాటి నుంచే పార్టీ పతనం ప్రారంభమైందన్నది జగమెరిగిన సత్యమే. అప్పుడే జనాల్లో గుర్తింపు అనేది తగ్గుతూ వస్తోంది. ప్రాంతీయ పార్టీగా పుట్టి దేశాన్ని ఏలాలన్న కేసీఆర్‌లో కోరిక పుట్టడమే తొలి తప్పన్నది రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న మాట. ఎదురే లేదన్న స్థాయి నుంచి ఇప్పుడీ పరిస్థితి రావడానికి కారణాలేంటన్నది ఇప్పుడిప్పుడే గులాబీ పార్టీకి తెలిసొచ్చిందట. అదేంట్రా అంటే.. తెలంగాణ భవన్ వాస్తు సర్లేదట. కొందరు వేద పండితులు, వాస్తు పండితులు ఈ మాట చెప్పడంతో ఒకింత కంగుతిన్న కారు పార్టీ అగ్రనేతలు వెంటనే.. మార్పులు, చేర్పులు చేసేశారట. ముఖ్యంగా.. భవన్‌లోకి వెళ్లే ఎంట్రీ.. బయటికి వచ్చే ఎగ్జిట్ గేటును మార్చేశారట. ఈశాన్యం నుంచి రాకపోకలు సాగించేలా గేటు కొత్తగా ర్యాంప్ ఏర్పాటు చేసేశారట. అంటే.. ఇన్నాళ్లు గులాబీ పార్టీకి ఉన్నది గేటు పోటు అన్న మాట.
ఇదే నిజమనుకుంటే..?
వాస్తవానికి వాస్తు, సెంటిమెంట్లు కేసీఆర్‌కు ఎక్కువే. ఏ పనిచేయాలన్నా దాన్ని ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించే ముందుకెళ్తుంటారు. అలాంటి కేసీఆర్‌కు ఇన్నాళ్ల తర్వాత ఎందుకీ పరిస్థితి అని ఆలోచన తట్టిందట. దీంతో వెంటనే వాస్తు పండితులను పిలిపించడం.. వాస్తు చూపించడం చేశారట. అయ్యో సారూ.. ఇన్నాళ్లు ఈ భవన్‌లో ఎలా ఉన్నారు..? ఇన్ని వాస్తు దోషాలున్నాయ్.. వెంటనే మార్చేయండని పండితులు చెప్పారట. దీంతో మార్పులు, చేర్పులు చేయాల్సినవి చేసేశారట. పోనీ.. ఇప్పటి వరకూ జరిగింది అంతా అటు పక్కనెట్టేద్దాం.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయ్ కదా.. ఎలాగో వాస్తు ప్రకారమే మార్పు చేసేశారు కూడా. ఇకనైనా కారుకు మంచి రోజులు వస్తాయా.. పోనీ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుని పరువు నిలబెట్టుకుంటుందా అనేది ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏం జరుగుతుందో చూడాలి మరి.