ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. మొత్తం టీడీపీనే చేసిందని వైసీపీ.. తప్పు మీది పెట్టుకుని నిందలు మాపైనా అని కూటమి.. ఇలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఏప్రిల్-03 గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో.. వృద్ధులు, వికలాంగులు, వితంతవులు పడిగాపులు కాశారు. నడవలేక కొందరు.. సొమ్మసిల్లి మరికొందరు.. మంచాలపై ఇంకొదర్ని తీసుకెళ్తూ.. ఇలా చిత్ర విచిత్రాల హృదయ విదారక చిత్రాలే చూశాం.! ఆఖరికి సచివాలయం దగ్గరికి వస్తే పెద్ద క్యూనే ఉంది. వేచి చూసి.. చూసి ఆఖరికి పెన్షన్ తీసుకోకుండానే వెనుదిరిగిన వారెందరో.. ఇదీ ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌లో ముఖచిత్రం. ఇంతకీ ఈ పెన్షన్ల పాపం ఎవరిది.. ఎందుకిలా ముసలీముతక ఉసురు పోసుకుంటున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!
ఇంత ఓవరాక్షనా..?
వలంటీర్ల పెన్షన్లు ఇవ్వడానికి లేదని.. సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయాలని.. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులకు ఇంటికెళ్లి ఇవ్వాల్సిందేనని కేంద్ర ఎన్నికల కమిషన్ క్లియర్ కట్‌గా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ ఆదేశాలు పాటిస్తే ఒట్టు. పైగా మొత్తం టీడీపీయే చేసిందని జనాలకు తెలియజేయడానికి వైసీపీ చేసిన షో అంతా ఇంతా కాదు. బాబోయ్.. ఇన్ని అతి తెలివి తేటలు ఎక్కడివిరా బాబూ అని ముక్కున వేలేసుకునేలా సీన్ క్రియేట్ చేసేసింది వైసీపీ క్యాడర్. కొన్ని ప్రాంతాల్లో వికలాంగులు, నడవలేని వృద్ధులను మంచాల మీద తీసుకెళ్లిన పరిస్థితి. పోనీ.. మానవత్వం చూపించారనే అనుకుందాం.. వారిని ఆటోల్లో.. ఇతరత్రా వాహనాల్లో తరలించొచ్చు.. కానీ అలా చేయకుండా ఇలా మంచాల్లో తరలించడం ఎంతవరకు సబబు..? అనేది వైసీపీకే తెలియాలి. ఇదంతా సిపంతీ షో అని క్లియర్ కట్‌గా అర్థం కావట్లేదా.. సభ్య సమాజం అంతా చూసే ఉంటుంది కదా..! ఇంటికెళ్లి ఇవ్వాల్సిన పెన్షన్లకు ఇలా చేయడం బహుశా వైసీపీకీ చెల్లుతుంది మరి. ఏదేమైనా పెన్షన్లు మాత్రం మొదటి రోజు విజయవంతంగానే అందజేసింది వైసీపీ సర్కార్. ఇక అక్కడక్కడా విమర్శలు, ఆరోపణలు ఇక మామూలే.
ఎంత పనిచేశావ్ నిమ్మగడ్డ!
విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు పెన్షన్ల విషయంలో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వర్సెస్ టీడీపీ అధినేత చంద్రబాబుగా పరిస్థితులు ఏర్పడినట్లు సమాచారం. యూ స్టూపిడ్.. ఎంత పనిచేశావ్.. అసలు పెన్షన్లకు వ్యతిరేకంగా కేసు వేయమన్నదెవరు..? ఈసీకి ఫిర్యాదు చేసిందెవరు..? అని నిమ్మగడ్డకు బాబు చీవాట్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఏ మాత్రం తగ్గని నిమ్మగడ్డ.. మీరు చెప్పిన ప్రకారమే కేసు, ఫిర్యాదు చేశానన్న విషయం మరవకండని చెప్పారట. ఈ మొత్తం వ్యవహారం టీడీపీలో పెద్ద ప్రకంపనలే రేపుతోందట. ఏదేమైనా ఇది వ్యూహాత్మక తప్పిదమని చంద్రబాబు మదనపడుతున్నారట. పెన్షనర్ల నోళ్లలో నానడమేంటి..? ఇన్నిరోజులూ ఇంటికే 4వేల రూపాయిలు పెన్షన్లు ఇస్తామని ఓ రేంజ్‌లో జనాల్లోకి తీసుకెళ్లిన చంద్రబాబుకు ఇప్పుడీ పరిస్థితి రావడం స్వయంకృపరాథమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూశారుగా.. అటు వైసీపీ మాత్రం అబ్బే మాదేం లేదని చెబుతుంటే.. టీడీపీ మాత్రం మీదే మీదే తప్పని చెబుతోంది. ఫైనల్‌గా తప్పెవరిదో.. ఈ పాపం ఎవరికో.. ఫలితం ఎలా ఉంటుందో పెన్షనర్లు మే-13న తేల్చిచెప్పబోతున్నారు.