సీనియర్ హీరో వెంకటేష్ తన కొత్త చిత్రాన్ని మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రానా-నాయుడు పనుల కోసం ముంబై వెళ్లి వస్తున్న వెంకటేష్ మధ్యలో కుమార్తె పెళ్లి పనుల్లో బిజీగా మారారు. ఇకపై తన తదుపరి మూవీని మొదలు పెట్టే కసరత్తులో ఆయన ఉన్నారు. వెంకీ.. అనిల్ రావిపూడి తో ముచ్చటగా మూడో సినిమాకి శ్రీకారం చుట్టారు. సంక్రాంతికి వస్తున్నామంటూ టైటిల్ తోనే 2025 సంక్రాంతికి వార్ షురూ చేసారు.
అయితే వెంకీ-అనిల్ టైటిల్ సంక్రాంతికి వస్తున్నామని రిజిస్టర్ చేయించారు కానీ.. ఈచిత్రం ఎప్పుడు మొదలవుతుందో అనే కన్ఫ్యూజన్ లో దగ్గుబాటి అభిమానులు ఉన్నారు.
ఈ సంక్రాంతి సినిమా షూటింగ్ ఈ ఉగాది పర్వదినాన ప్రారంభం కానుంది అని తెలుస్తోంది. ఉగాది రోజున లాంఛనంగా ఈ చిత్రానికి క్లాప్ కొట్టినా మేలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారట. ఈ చిత్రంలో వెంకటేష్ తో ఇద్దరు భామలు రొమాన్స్ చేస్తారని.. అందులో ఓ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. మరో పాత్రకి త్రిష కానీ.. లేదంటే మరో పేరున్న హీరోయిన్ ని కానీ వెంకీ కోసం అనిల్ రావిపూడి తీసుకొస్తాడని అంటున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని పక్కా పల్లెటూరి బ్యాక్డ్రాప్ లో అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్నారని, సొంతూరు, అక్కడి అనుబంధాలు, స్నేహాలూ మధ్యన నడిచే కథగా ఈ చిత్రం ఉండబోతుంది అని తెలుస్తోంది. మిగతా వివరాలు ఉగాది రోజునే రివీల్ చేస్తారని సమాచారం.