బీఆర్ఎస్‌కు బుద్ధి వచ్చినట్టేనా..?
బీఆర్ఎస్‌కు గట్టిగానే బుద్ధొచ్చిందా..? దెబ్బకు దెయ్యం వదిలినట్టేనా..? అంటే తెలంగాణలో తాజా పరిణామాలను బట్టి చూస్తే స్పష్టంగానే అర్థమవుతోంది. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టుమని పది మంది కూడా లేరన్న విషయం జగమెరిగిన సత్యమే. అలాంటిది నాడు కేసీఆర్ ఉద్యమం ప్రారంభించడం, రానే రాదు అన్న తెలంగాణ సాధించారు. నాడు ఉద్యమంలో పాల్గొన్న నేతలు ఎంతమంది..? రాష్ట్ర సాధనలో పాలుపంచుకున్న వారు ఎంత మంది అనేది వేళ్ల మీద లెక్కెట్టొచ్చు. అయితే.. ఉద్యమ పార్టీ, రాష్ట్రాన్ని సాధించిన పార్టీ.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో తాజా పరిణామాలను బట్టి చూస్తే మీకే అర్థమవుతుంది.
దెబ్బకు సెట్!
బీఆర్ఎస్ ఎంత మంది నేతలతో ప్రారంభమైంది..? అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయే పార్టీల నుంచి కారులో చోటుకోసం వచ్చారో అందరం చూశాం. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీకి చాన్స్ కూడా ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. అధికారంలోకి రావడమే ఆలస్యం 2014 ఎన్నికల తర్వాత.. అప్పటి వరకూ టీడీపీ బాగా ఊపులో ఉండటంతో ఆ పార్టీని పూర్తిగా ఖాళీ చేసేశారు కేసీఆర్. ఇక 2018 ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసేశారు. సీన్ కట్ చేస్తే.. ఉద్యమ పార్టీ కాస్త చేరికల పార్టీగా మారిపోయి.. కారు హౌస్ ఫుల్ అయిపోయింది. అధికారం ఉంది.. ఏమైనా చేసేయచ్చు అని చేయాల్సిందంతా చేసేసింది కల్వకుంట్ల కుటుంబం. ఇక ఎత్తొచ్చిన నేతలు సైతం ఇష్టానుసారం వ్యవహరించారు. మేం చెప్పిందే వేదం.. చేసిందే శాసనం.. తనను మించి రాజకీయ చాణక్యుడు లేడు.. ఒక్క మాటలో చెప్పాలంటే మోనార్క్ కంటే దారుణంగా కేసీఆర్ వ్యవహరించారన్నది ప్రధాన ఆరోపణ. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేసినా అదేమీ జరగలేదు. దీంతో కాంగ్రెస్‌లోకి అధికారంలోకి రావడం.. ఏ జీరోతో అయితే బీఆర్ఎస్ మొదలైందో దాదాపు అదే పరిస్థితికి వచ్చేయబోతోంది ఉద్యమ పార్టీ.
కాళ్లు పట్టుకున్నా సరే..!
ఎవర్ని పడితే వారిని పార్టీలోకి రానిచ్చుకోవడం.. ఇష్టానుసారం పదవులు ఇచ్చేయడం.. ఆఖరికి పదవులు, అధికారం పోయిన తర్వాత ఇదిగో ఇప్పుడున్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. ఇవన్నీ వెరసి బీఆర్ఎస్‌కు వచ్చిన బుద్ధి ఏంటంటే.. అనవసరంగా రాజకీయ అవకాశవాదులు, బ్రోకర్లుకు పార్టీలో చోటిచ్చామని తెలిసొచ్చింది. అందుకే.. ఇక పార్టీని వీడిని వారెవ్వరినీ మళ్లీ చేర్చుకోకూడదని ఫిక్స్ అయ్యింది. ఆఖరికి కాళ్లు పట్టుకున్నా సరే తిరిగి చేరనివ్వమని తెగేసి చెబుతున్నారు బీఆర్ఎస్ అగ్రనేతలు. పార్టీ నుంచి వెళ్లేవారు మధ్యలో వచ్చిన వారేనని హరీష్ రావు, కేటీఆర్ లాంటివారి నోట వచ్చిందంటే ఎంత బుద్ధొచ్చిందో అని రాష్ట్ర ప్రజలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. పవర్ బ్రోకర్లు మాత్రమే పార్టీ మారుతున్నారు తప్ప.. ఉద్యమకారులు, కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ వీడట్లేదన్నారు. రేపొద్దున్న కాళ్లు మొక్కినా మళ్లీ పార్టీలోకి రానిచ్చేది లేదని తేల్చిచెప్పేశారు. చూశారుగా.. పార్టీ పరిస్థితిపై అగ్రనేతలు ఎలా మాట్లాడారో.. రేపొద్దున్న పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి. ఏదైతేనేం.. బీఆర్ఎస్‌కు గట్టిగానే బుద్ధొచ్చిందన్న మాట.