అవును.. కాంగ్రెస్‌లోకి వెళ్తున్నా.. కాంగ్రెస్‌లోనే చచ్చిపోతా.. ఇవీ కే. కేశవరావు అలియాస్ కేకే మాటలు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో కీలక భేటీలో సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలివీ. తన అత్యంత సన్నిహితుడు, లెఫ్ట్ హ్యాండ్‌గా ఉన్న కేకే కారు దిగి హస్తం గూటికి చేరుతారన్న వార్తలతో తన ఫామ్ హౌస్ పిలిపించుకున్న గులాబీ బాస్.. క్లాస్ తీసుకున్నారు. పార్టీ మారి తీరుతాను.. ఇందులో ఎలాంటి ఢోకా లేదని కేకే.. ఈ ప్రతిపాదనపై సారు సీరియస్ అయ్యి ఏం తక్కువ చేశానని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారం అనుభవించి.. ఇప్పుడు పార్టీ మారతానంటే ప్రజలు గమనిస్తారని.. పార్టీలో తక్కువ చేసిందేంటో చెప్పాలని కేకేపై గులాబీ కన్నెర్రజేశారు. లేదు.. కాంగ్రెస్‌లోకి వెళ్తా.. అక్కడే చచ్చిపోతానని కేకే చెప్పడం గమనార్హం. ఇక ఫైనల్‌గా ఈ ఆలోచన తప్పు కేకే.. ఒకసారి మనసుపెట్టి ఆలోచించుకోండి అని చెప్పిన కేసీఆర్ మిన్నకుండిపోయారు. చూశారుగా.. ఇదీ కేసీఆర్.. కేకే మధ్య జరిగిన డిస్కషన్.
కేకేకు ఏం తక్కువైంది..?
కాంగ్రెస్‌లోనే పుట్టి పెరిగిన కేకే.. హస్తాన్ని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. సీనియర్ నాయకుడిగా, అనుభవం ఉన్న నేతగా ఉన్న కేశవరావుకు ఏదీ తక్కువ చేయకుండా రాజ్యసభకు పంపడం, ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇచ్చారు. ఈ మేయర్ వ్యవహారంలో ఎన్ని నాటకీయ పరిణామాలు జరిగాయో.. కేసీఆర్ ఎవరెవర్ని వదులుకోవాల్సి వచ్చిందో ప్రత్యకించి చెప్పక్కర్లేదు. పదేళ్లపాటు కేకే చెప్పిందే వేదం.. కేకే ఏం చేసినా చెల్లేది.. ఒక్కసారిగా అధికారం దూరమయ్యేసరికి కారులో ఇమడలేకపోయారు. కాంగ్రెస్‌లో చేరడానికి చాలా రోజులుగానే రంగం సిద్ధం చేసుకున్నారాయన. అందుకే విజయలక్ష్మి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం, ఇవన్నీ పార్టీ మార్పునకు బలం చేకూర్చాయి. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు మొత్తం వ్యవహారం బయటికొచ్చేసిందన్న మాట. ఆఖరికి కేసీఆర్ రంగంలోకి దిగి సముదాయించినా కేకే వెనక్కి తగ్గని పరిస్థితి ఉందంటే.. తెరవెనుక చాలానే జరిగి ఉండోచ్చనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
అవును హస్తం గూటికే..!
కాంగ్రెస్ పార్టీలో చేరికపై కేకే, ఆయన కుమార్తె కీలక ప్రకటనే చేశారు. కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని.. తాను కూడా కేసీఆర్‌ప గౌరవంతోనే ఉన్నానన్నారు. కాంగ్రెస్ వెళ్తున్నానని సారుకు చెప్పానని.. ఈ నెల 30న కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. తాను గతంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానన్న విషయాన్ని కేకే గుర్తు చేసుకున్నారు. 84 ఏళ్ల వయస్సులో తాను తిరిగి సొంత పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు.. అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయని కేకే కుమార్తె వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే.. కేకే కుమారుడు విప్లవ్ కుమార్ మాత్రం.. తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగనున్నట్లు వెల్లడించారు. తన తండ్రి, సోదరి నిర్ణయాలతో సంబంధం లేదని.. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్‌పై పూర్తి నమ్మకం ఉందని విప్లవ్ చెప్పుకొచ్చారు. ఇక యథావిధిగా కేకే ఇంటికి వెళ్లడానికి రేవంత్ సిద్ధమయ్యారు.. పార్టీలోకి ఆహ్వానించి ఢిల్లీ వేదికగా కండువా కప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేకే వల్ల కాంగ్రెస్‌కు ఏ మాత్రం ఒరుగుతుందో చూడాలి మరి.