అబ్బే.. జగన్ ప్రసంగంలో పస లేదే!
అవును.. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగంలో పస లేకుండా పోయింది. అసలు ఆయన ఏం మాట్లాడాలని ప్రిపేర్ అయ్యారో.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఏం మాట్లాడారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ యాత్రను చేపడుతున్న జగన్.. తొలి రోజు ప్రొద్దుటూరు వేదికగా ప్రసంగించారు. ఆయన ప్రసంగం విన్న జనాలు, సొంత పార్టీ నేతలు ఒకింత విస్తుపోయిన పరిస్థితి. అన్న ఏదో చెబుతారని వచ్చిన కార్యకర్తలు.. అధినేత ప్రసంగం ఇరగదీస్తారని భావించిన నేతలు చివరికి అసంతృప్తితోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నాలుగేళ్లు అధికారంలో ఉండి ఇదిగో ఫలానా చేశానని.. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాననే విషయాలను చెప్పాల్సిన జగన్ ఎక్కడా ఆ విషయాలను కనీసం ప్రస్తావించనే లేదు.
ఏమైందన్నో..!
వైఎస్ జగన్ ఊహించిన దానికంటే ఎక్కువగానే జనాలు వచ్చారు.. కనుచూపు మేరలో ఎటు చూసినా కార్యకర్తలు, నేతలే. ఇక జగన్ స్పీచ్ రానే వచ్చింది.. ఇక ప్రతిపక్షాలు బెంబేలెత్తేలా మాట్లాడుతారని.. విమర్శలు, కౌంటర్లు, ఎటాక్‌లు గట్టిగానే ఉంటాయని అందరూ అనుకున్నారు కానీ.. పాత చింతకాయ పచ్చడిలాగే సింగిల్‌గా వస్తున్నాం, మన జెండా వేరే జెండాతో జట్టుకట్టట్లేదని.. ప్రజలే అజెండా అని చెప్పుకొచ్చారు. ఇక ప్రజలే శ్రీకృష్ణుడిగా.. తాను అర్జునుడిగా ఆయన అభివర్ణించుకున్నారు. అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసాలు చేసేవాళ్లు ప్రత్యర్థులుగా ఉన్నారన్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు అంటూ మళ్లీ అవే మాటలే జగన్ మాట్లాడారు. ఇంతకుమించి ప్రతిపక్షాల గురించి వేరే మాటలు జగన్‌కు దొరకలేదు. ఈ ప్రసంగం విన్న జనాలు, పార్టీ నేతలు అన్న ఏమైందబ్బా.. ఎంతసేపూ అదే క్యాసెట్ రివర్స్ తిప్పి తిప్పి మాట్లాడేస్తున్నారని అనుకుంటున్నారు.
చెల్లెల్లు, బాబాయ్ గురించి..!
అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. కుటుంబాలను చీల్చడానికి చెల్లెళ్లను (వైఎస్ షర్మిల, వైఎస్ సునీత) తనపై బురద చల్లేందుకు పంపించారని.. వీరి వెనుక ఎవరున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదన్నారు. ఇక బాబాయ్ వివేకానందను అతి దారుణంగా చంపి.. చంపినోళ్లకు ఎవరు మద్దిస్తున్నారో చూస్తున్నామన్నారు. ఇక ఎలాగో ఎల్లో మీడియా గురించి మళ్లీ ప్రస్తావించారు. గత ఎన్నికల్లో వివేకా హత్యగావించబడితే.. ఐదేళ్లు దాటినా.. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఏమీ చేయలేకపోయారని.. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ ఇలా మాట్లాడుతుండటం గమనార్హం. అసలు ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి..? ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా? అని జగన్ ప్రశ్నించారు. చూశారుగా.. జగన్ ప్రసంగంలో ఏ మాత్రం పస ఉందన్నది ఇక ప్రత్యేకించి చెప్పక్కర్లేదేమో.