కూటమిలో భాగంగా 10 అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్న బీజేపీ.. అభ్యర్థులను ప్రకటించింది. ఈ అభ్యర్థులల్లో ఒకరిద్దరు తప్ప.. పార్టీ కోసం పనిచేసిన వారు కానీ.. ఒరిజినల్ కమలనాథులు లేకపోవడం గమనార్హం. దీంతో నిన్న గాక మొన్న వచ్చిన నేతలకు టికెట్లు ఇచ్చిన అధిష్టానం.. పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నోళ్లకు నిరాశే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఎంపీ అభ్యర్థులుగా చాన్స్ దక్కకపోవడంతో.. కనీసం ఎమ్మెల్యేగా పోటీచేసే ఛాన్స్ అయినా వస్తుందని చాలా మంది పార్టీని నమ్ముకున్నోళ్లు భావించారు. కానీ వారి ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. ఇదిగో అభ్యర్థులు ఎవరెవరో చూసేయండి.. వారి గురించి తర్వాత మాట్లాడుకుందాం..
10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..
ఎచ్చెర్ల : ఎన్.ఈశ్వర్‌రావు
విశాఖ నార్త్ : పి. విష్ణుకుమార్‌రాజు
అరకు : పంగి రాజారావు
అనపర్తి : ఎం.శివకృష్ణంరాజు
కైకలూరు : కామినేని శ్రీనివాసరావు
విజయవాడ వెస్ట్ : సుజనా చౌదరి
బద్వేల్ : బొజ్జ రోషన్న
జమ్మలమడుగు : సి. ఆదినారాయణరెడ్డి
ఆదోని : పీవీ పార్థసారథి
ధర్మవరం : వై. సత్యకుమార్
ఇదిగో ఈ జాబితాను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. విష్ణుకుమార్ రాజు, కామినేని, సత్యకుమార్ తప్ప దాదాపు మిగిలిన వాళ్లంతా పార్టీ కోసం అంతంత మాత్రం పనిచేసిన వాళ్లే. ఇక మిగిలిన వారు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే. విష్ణువర్ధన్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, జీవీఎల్ నర్సింహారావు ఇలా చాలా మంది కీలక నేతలు, యువనేతలకు అధిష్టానం హ్యాండిచ్చేసింది. వాస్తవానికి వీరంతా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి.. పార్టీని ఇంతవరకూ తెచ్చారు. కానీ వీరందర్నీ పక్కనెట్టేయడం ఎంతవరకు సబబో ఏంటో మరి. కాగా.. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు పలువురు అగ్రనేతలకు రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ లేఖలు రాశారు. పొత్తులో భాగంగా బీజేపీకి సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికలో మొదట్నుంచీ పార్టీలో ఉన్న, పార్టీ కోసం పనిచేసిన నేతలకు అన్యాయం జరుగుతోందని మొరపెట్టుకున్నారు. అంతేకాదు.. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్నోళ్లకు టీడీపీ నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారని అసంతృప్తిని వెలిబుచ్చారు. అయినప్పటికీ అగ్రనేతలు ఏ మాత్రం పరిగణనలోనికి తీసుకోకపోవడం గమనార్హం. టికెట్ రాని నేతలంతా ఇప్పుడు ఏం చేయబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.