సుజనా చౌదరి.. ఈయన గురించి, బ్యాగ్రౌండ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రాష్ట్రంలో.. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా హవా మాత్రం ఈయనదే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైన నాటి నుంచి నిన్న, మొన్నటి వరకూ ఎక్కువగా వినపడిన పేరు సుజనానే. అదిగో అక్కడ్నుంచి పోటీచేస్తున్నారు.. ఇదిగో ఇక్కడ్నుంచి పోటీచేస్తున్నారని వార్తలు, పుకార్లు షికార్లు చేశాయే తప్ప.. అసలు సిసలైన అభ్యర్థుల జాబితాలో మాత్రం పేరు లేకపోవడంతో ఈయన పేరు లేకపోవడం ఏంటని ఒకింత ఆశ్చర్యపోయారు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు, 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించారు కూడా. మరీ ముఖ్యంగా పార్టీకి పైసలు పెట్టింది.. వన్ అండ్ ఓన్లీ సుజనానే అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించి బాబు తన రుణం తీర్చుకున్నారని చెబుతుంటారు. ఇలాంటి వ్యక్తి 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారానికి దూరం కావడంతో బీజేపీలో చేరిపోయి.. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అయితే 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు గుప్పుమన్నాయి. సీన్ కట్ చేస్తే సుజనా అడ్రస్ లేదు.
ఏం జరిగిందో..?
విజయవాడ లేదా గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి సుజనాకు టికెట్ దక్కుతుందని అందరూ భావించారు.. ఆయన కూడా ఆశపడ్డారు కానీ.. ఎందుకే అవన్నీ అస్సలు జరగలేదు. చంద్రబాబు ఆదేశాలతోనే ఈ రెండు స్థానాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీచేస్తారని అటు టీడీపీలో.. ఇటు బీజేపీలో ప్రచారం పెద్ద ఎత్తునే జరిగింది. ఇక ఈ రెండు పార్టీల అనుకూల మీడియాలో అయితే వార్తలే వార్తలు. కానీ.. ఈయనతో పాటు బీజేపీలో చేరిన సీఎం రమేష్‌కు అనకాపల్లి ఎంపీ టికెట్ వచ్చింది కానీ సుజనాకు మాత్రం హ్యాండిచ్చేసింది కూటమి. దీంతో అసలు ఏం జరిగింది..? సుజనాను విస్మరించడమేంటి..? ఈయనకు టికెట్ రాకుండా ఎవరైనా అడ్డుకున్నారా..? అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. ఇదంతా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పనేనని తెలియవచ్చింది.
అసలు కథ ఇదేనా..?
సుజనా బీజేపీలో చేరినప్పటికీ ఏ నాడు పార్టీ బలోపేతం కోసం ఒక్కటంటే ఒక్కటీ చేసిన పాపాన పోలేదని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఉన్న కమలనాథులు చెబుతున్న మాట. పైకి బీజేపీలో ఉన్నా లోలోపల మాత్రం టీడీపీ కోసమే పనిచేశారన్నది ప్రధాన ఆరోపణ. టీడీపీ ప్రయోజనాలు తప్ప.. బీజేపీ కోసం పనిచేయలేదట. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి కూడా రాష్ట్రానికి సాధించేమీ లేదని.. ఇప్పుడు మళ్లీ లోక్‌సభకు పోటీ చేసి గెలిచినా.. రాజ్యసభ పదవి ఇచ్చినా పైసా ప్రయోజనం లేదన్నది పార్టీ నేతలు చెబుతున్న మాట. సీనియార్టీ, కేంద్రం, రాష్ట్రంలో ఆయనకున్న పలుకుబడితో మంత్రి పదవి దక్కించుకుంటారనే పురంధేశ్వరిలో అసూయ మొదలైందట. పైగా.. ఈ ఎన్నికల్లో రాజమండ్రి పోటీచేస్తున్న పురంధేశ్వరి గెలిచినా ఓడినా.. కచ్చితంగా కేంద్రంలో మాత్రం పదవి పక్కా అని అగ్రనేతలు హామీ ఇచ్చారని టాక్. ఇందుకే సుజనాను ఎక్కడికక్కడ ఆమె.. తొక్కి పట్టారని చర్చ జరుగుతోంది. అయితే.. మరోవైపు లోక్‌సభ సీటు దక్కకపోయినా తప్పకుండా ఎమ్మెల్యేగా పోటీచే సే అవకాశం సుజనాకు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తారని.. గెలిస్తే మంత్రి పదవి పక్కాయేనని తెలుగు తమ్ముళ్లు, కమలనాథులు చెప్పుకుంటున్న మాట.