హెడ్డింగ్ చూడగానే ఇదేం విడ్డూరం బాబోయ్ అని అనుకుంటున్నారు కదా.. అవునండోయ్.. మీరు వింటున్నది నిజమే.. ఈ పిలునిచ్చింది మరెవరో కాదు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబు. రెండ్రోజుల పాటు కుప్పంలో పర్యటనకు వెళ్లిన బాబు.. ఎన్టీఆర్ భవన్‌లో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తేనే భర్తలకు అన్నం పెట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు. నిజమైన దేవతలు ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారని.. మీకోసం కుప్పంకు వచ్చినట్లు తెలిపారు. ఇక్కడి మహిళల ఉత్సాహం చూస్తే చాలా ధైర్యం వచ్చిందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అతి తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని మాటిచ్చారు. ఏపీలో నాసిరకం మద్యం అమ్ముతూ.. ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచేస్తున్నారని జగన్ సర్కార్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో రూ.60 మద్యం ధర రూ.200 అయ్యిందని మండిపడ్డారు.
లక్ష కావాలి!
కుప్పం వస్తే చాలు రీఛార్జ్ అవుతానని.. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ శక్తి తనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మరోసారి కుప్పం నియోజకవర్గంలో తన గెలుపును రెన్యూవల్ చేయాలని చంద్రబాబు కోరారు. ఏపీలో వైసీపీ పాలన అంతం కావాలంటే లక్ష మెజార్టీతో కుప్పంలో టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత 35 ఏళ్లుగా ఏడు పర్యాయాలు తనను ఎమ్మెల్యేగా గెలిపించడం సంతోషకరమన్నారు. ఆ పరంపరను రెన్యువల్ చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చానన్నారు. మళ్లీ గెలిపించమని కుప్పం ప్రజల ఆశీస్సులు కోరారు. ఏపీలో ఎన్నికల ప్రచారానికి కుప్పం నుంచే శ్రీకారం చుడుతున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా జరగాల్సి అవసరం ఉందన్నారు. మహిళలను అసాధారణ శక్తిమంతులుగా చేసే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజలు ఎంతో నిస్వార్థంగా తనను అభిమానిస్తారని, అది తనకు బాగా నచ్చే అంశం అని చంద్రబాబు వివరించారు. అయితే.. చంద్రబాబు పరిస్థితి ఎక్కడ్నుంచి ఎక్కడికొచ్చిందో చూడండి అంటూ నెట్టింట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.