మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024 ఆరంభ మ్యాచ్‌లో డిఫెడింగ్ చాంఫియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయంతో ఖాతా తెరిచింది. ఇటీవల డబ్ల్యూపీఎల్‌లో కప్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ ఐపీఎల్ తొలి మ్యాచ్‌ని ఓటమితో మొదలెట్టింది. ఆరంభ వేడుకల అనంతరం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ అలవోకగా.. ఆడుతూపాడుతూ 18.4 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో స్టేడియంలో సంబరాలు అంబరాన్నంటాయి. #CSKvRCB
తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో.. కీపర్ అంజు రావత్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48), దినేష్ కార్తీక్ (26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 నాటౌట్) భారీ భాగస్వామ్యం నెలకొల్పి బెంగళూర్ పరువు నిలబెట్టారు. అంతకు ముందు కింగ్ కోహ్లీ 21 పరుగులు, కెప్టెన్ డుప్లిసెస్ 35 పరుగులు చేయగా.. వారిద్దరి అవుట్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రజత్ పటిదార్, మ్యాక్స్‌వెల్ వెంటవెంటనే డకౌట్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన గ్రీన్ (18) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. రావత్, కార్తీక్ మాత్రం చెన్నై బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి.. జట్టు స్కోరును 173కు చేర్చారు. #ChennaiSuperKings
174 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై జట్టు.. 38 పరుగుల వద్ద కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (15) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన అజింకా రహానేతో కలిసి రచిన్ రవీంద్ర స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసిన రచిన్.. స్కోరు 71 పరుగు వద్ద కర్న్ శర్మ బౌలింగ్‌లో క్యాచ్‌గా వెనుదిరిగాడు. రహానే 27 పరుగులు, మిచెల్ 22 పరుగులు చేసి అవుటవ్వగా.. మిగిలివున్న స్కోర్‌ని మరో వికెట్ పోనియకుండా.. శివమ్ దూబే (28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 34), రవీంద్ర జడేజా (17 బంతుల్లో 1 సిక్సర్‌తో 25) సక్సెస్‌ఫుల్‌గా చెన్నైని విజయతీరానికి చేర్చారు. దీంతో చెన్నై ఈ ఐపీఎల్‌లో బోణీ చేయగా.. బెంగళూర్ భారీ స్కోర్ చేసి కూడా నిరాశ చెందక తప్పలేదు. చెన్నై జట్టులో ముస్తాఫిజుర్ 4 వికెట్లు తీసుకోగా, చాహర్ ఒక వికెట్ తీసుకున్నాడు. బెంగళూర్ జట్టులో గ్రీన్ 2, యశ్ దయాల్ 1, కర్న్ శర్మ 1 చొప్పున వికెట్లు తీసుకున్నారు.
అదిరేలా ఆరంభ వేడుకలు
మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024 ఆరంభ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. చెన్నై చిదంబరం స్టేడియంలో సంబరాలు అంబరాన్ని తాకేలా.. కోలాహలంగా ఆర్గనైజర్స్ ఈ వేడుకలను నిర్వహించారు. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌తో పాటు.. సింగర్ సోనూ నిగమ్, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ప్రదర్శనతో మైదానం మోత మోగిపోయింది.