జనసేన కాకినాడ అభ్యర్థి బ్యాగ్రౌండ్ ఏంటి..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటనలు చేసుకుంటూ వెళ్తున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో భాగంగా ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను అఫిషియల్‌గా ప్రకటించగా.. తాజాగా ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఇక అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో రగిలిన చిచ్చు ఇంకా ఆరణే (ఆరణి శ్రీనివాసులు) లేదు. అయితే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఎవరీ ఉదయ్..? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి..? ఇన్నాళ్లు ఏం చేశారు..? కాకినాడ నుంచి గెలిచే అవకాశాలు ఏ మాత్రం ఉన్నాయ్..? అని చర్చ మొదలైంది.. మరోవైపు నెట్టింట్లోనూ జనాలు వెతకడం మొదలెట్టేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు తంగెళ్ల గురించి తెలిసొచ్చాయ్. ఇక ఆలస్యమెందుకు.. చూసేద్దాం రండి మరి..
ఎవరీ ఉదయ్..?
అవును ఉదయ్ సామాన్యుడు కాదు.. 2006లో హైదరాబాద్‌లోని టీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో పట్టా అందుకున్నారు. అనంతరం పలు ఐటీ సంస్థల్లో పనిచేశారు. దుబాయ్ వేదికగా ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసిన ఆయన.. అప్పటి వరకూ విలాసవంతమైన జీవితాన్నే గడిపారు. కాస్ట్‌లీ జాగ్వార్ కారు, లగ్జరీ విల్లా ఉన్న ఉదయ్.. 29 ఏళ్ల వయసులోనే కళ్లు చెదిరే జీతంతో కూడిన ఉద్యోగాన్ని వదిలేశారు. ఎందుకంటే.. సొంతంగా ఏదైనా సాధించాలనే తపన. దీంతో దుబాయ్‌ను వదిలేసి భారత్ వచ్చి.. Tea Time (టీ టైమ్) పేరుతో 2016లో ఇండియా వ్యాప్తంగా టీ షాపుల చెయిన్ ప్రారంభించి.. కోట్లలో టర్నోవర్‌తో యంగ్ బిజినెస్‌మెన్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ.. ఉద్యోగం మానేసిన విషయాన్ని మాత్రం తంగెళ్ల ఫ్యామిలీ అస్సలు జీర్ణించుకోలేకపోయింది. కుటుంబ సభ్యుల నుంచి ఏ మాత్రం సపోర్టు లేదు. ఆ సమయంలో ఉదయ్‌కు అండగా నిలిచింది ఒకే ఒక్కరు భార్య బకుల్ మాత్రమే. ఆమె ఆయుర్వేదిక్ డాక్టర్ కావడంతో ప్రోత్సహించడంతో ఉదయ్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు. తొలి టీ దుకాణం రాజమండ్రిలోనే.. అదికూడా రూ. 5 లక్షల పెట్టుబడితో ప్రారంభమై.. అలా ప్రాంచైజీల సంఖ్య క్రమంగా పెరుగుతూ పెరుగుతూ 3వేలకు చేరింది. సీన్ కట్ చేస్తే.. టీ టైమ్ ప్రైవేట్ లిమిటెడ్ టర్నోవర్ రూ. 35 కోట్లకు చేరింది. టీ టైమ్ ఐడియా ఓ రేంజిలో వర్కవుట్ కావడంతో ఉదయ్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఇప్పుడు ఏడాదికి 300 కోట్ల రూపాయిల ఆదాయం వస్తోందంటే మామూలు విషయం కాదు. వేలాది మందికి ఉపాధి సమకూరింది. హైదరాబాద్ వేదికగానే ఈ సంస్థ కార్యకలాపాలు జరుగుతున్నాయి.
పవన్ వైపు చూపు ఎందుకో..?
డబ్బున్నప్పటికీ ఉదయ్‌లో రాజకీయాల్లోకి రావాలని, ప్రజాసేవ చేయాలనే ఆసక్తి పెరిగింది. దీంతో ఏ మాత్రం ఆలోచించకుండా తన అభిమాన హీరో, రాజకీయ నాయకులు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన కండువా కప్పుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఒకే పార్టీలోనే ఉన్నారు. గెలుపోటములను లెక్కజేయకుండా పార్టీ కోసమే పనిచేస్తూ వచ్చిన ఉదయ్‌కు మంచి భవిష్యత్తు, ఆయన ఆలోచనలను ప్రోత్సహించాలని భావించిన పవన్.. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఉదయ్ తనకోసం, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారని.. ఆయన సేవలను సేనాని కొనియాడారు. కచ్చితంగా కాకినాడ ఎంపీ సీటు కొట్టాల్సిందేనని ధీమాతో పవన్ ఉన్నారు. ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇంచార్జీగా ఉదయ్ కొనసాగుతున్నారు. ఒకవేళ కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షాలు కచ్చితంగా ఎంపీగా పోటీచేయాలని ఒత్తిడి తెస్తే మాత్రం తాను కాకినాడ నుంచి ఎంపీగా.. పిఠాపురం నుంచి ఉదయ్ పోటీ చేస్తారని కూడా పవన్ ప్రకటించేశారు.
బీ వర్సెస్ బీ!
మరోవైపు.. వైసీపీ తరఫున పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ పేరుగాంచిన వ్యాపారవేత్తగా పేరుగాంచారు. కాపు సామాజిక వర్గానికి చెందిన చలమలశెట్టి వరుసగా మూడుసార్లు గెలుపు అంచులదాకా వెళ్లి తిరిగొచ్చారు. ఇప్పటికే మూడు పార్టీల కండువాలు మార్చిన ఆయన ఈసారి వైసీపీ తరఫున ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిందేనని ధీమాతో ఉన్నారు.. ఇందుకు సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. మొత్తానికి చూస్తే.. బిజినెస్‌మెన్ వర్సెస్ బిజినెస్‌మెన్‌గా పరిస్థితి ఉంది. ఆర్థికంగా, రాజకీయంగా ఇద్దరికీ బాగా ఉన్నవారే. ఈసారి పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తన గెలుపునకు కారణం అవుతాయని.. సింపతీ కూడా వర్కవుట్ అవుతుందనే ధీమాతో సునీల్ ఉన్నారు. అటు ఉదయ్ కూడా ఆర్థికంగా గట్టిగా ఉన్న మనిషే కావడంతో.. ఎవరెన్ని కోట్లు పోసి ఓట్లు సంపాదించుకుని గెలిచి నిలుస్తారో చూడాల్సిందే మరి.