కవితకు జైలు శిక్ష తప్పదా..?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జైలు శిక్ష పడుతుందా..? నేరం రుజువైన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతోంది..? ఒకవేళ జైలు శిక్ష పడితే ఎన్నేళ్లు పడొచ్చు..? ఇప్పుడిదే గులాబీ పార్టీని తొలిచేస్తున్న ప్రశ్నలు. ఇప్పటికే ఈ కేసులో కర్త, కర్మ, క్రియ కవితే అన్నట్లుగా ఈడీ రిమాండ్ రిపోర్టులో తేల్చిచెప్పడంతో ఇది మరింత గందరగోళానికి గురిచేసే పరిస్థితి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద కోట్ల రూపాయిలుగా లంచంగా ఇచ్చింది కూడా కవితేనని.. అని ఈడీ క్లియర్ కట్‌గా చెప్పింది. మరోవైపు.. రెండ్రోజులు పూర్తయిన ఈడీ కస్టడీ.. ఇంకో ఐదురోజులు మిగిలి ఉంది. ఈ కస్టడీ ప్రక్రియ పూర్తయ్యే లోపు కచ్చితంగా జైలుకు తరలించ్చన్నది ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయ్. ఎందుకంటే.. కవితను అరెస్ట్ చేసిన పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కింద కేసు కావడంతో కచ్చితంగా జైలు తప్పదని.. ఇందుకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను రెండేళ్లుగా ముప్పు తిప్పలు పెట్టడాన్ని బట్టిచూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఎన్నేళ్లు ఉండొచ్చు!
కవిత నేరం చేసినట్లు రుజువైతే కనీసం మూడు నుంచి ఏడేళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష పడే అవకాశముందని న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పాటు రూ. 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాదు.. ఎమ్మెల్సీ పదవి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. పదవి ఉండటం, పోవడం సంగతి అటుంచితే.. జైలు శిక్ష అనే మాటకొస్తేనే కల్వకుంట్ల ఫ్యామిలీ, బీఆర్ఎస్ శ్రేణులు కలవరపాటుకు గురవుతున్నాయి. ఈ నాలుగైదు రోజుల్లో ఏదైనా జరగొచ్చని ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు.. కవిత భర్త అనిల్ కుమార్‌కు నోటీసులివ్వడంతో అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. దీంతో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు కసరత్తు చేయాల్సిన అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీలోనే తిష్ట వేయాల్సి వచ్చింది.
కోర్టు నుంచి శుభవార్త ఉంటుందా..?
విచారణకు రావాలని పదే పదే ఈడీ సమన్లు జారీచేయడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించి, పిటిషన్ వేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీని ఆదేశించాలని కోర్టును కోరడంతో ఈ పిటిషన్ మంగళవారం నాడు విచారణకు రాబోతోంది. పైగా కవితపై ఎలాంటి చర్యలు తీసుకోమని చెప్పి కూడా అరెస్ట్ చేయడం, కస్టడీ తీసుకోవడంపై ఈడీ పట్ల కోర్టు కన్నెర్రజేస్తుందా లేకుంటే అబ్బే అదేం లేదని ఊరుకుంటుందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. అంతా మంచే జరుగుతుందని.. ఈడీని మోడీ ఇలా ఇబ్బందిపెట్టడానికే చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. మరి కవితకు కోర్టు నుంచి శుభవార్త ఉంటుందా లేకుంటే ఈడీని తన పని చేసుకోవచ్చనే ఆదేశాలు ఉంటాయా..? అనేది తేలాల్సి ఉంది.