మేం వేరు.. మా బ్లడ్, బ్రీడ్ వేరు.. అని టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెబుతూ ఉంటారు. అంటే అర్థమేంటో ఆయనకే తెలియాలి మరి. ఇంటర్వ్యూల్లో, మీడియా ముందు.. బహిరంగ సభల్లో.. ఇలా ఎవర్నయినా టార్గెట్ చేస్తూ లేదా హేళన చేస్తూ మాట్లాడాల్సి వచ్చిన ప్రతిసారీ ఈ విషయాన్ని గుర్తు చేస్తుంటారు. ఇదంతా ఎప్పుడో జరిగిన వ్యవహారం కదా.. ఇప్పుడెందుకొచ్చిందనే కదా మీ సందేహం అవును అక్కడికే వస్తున్నా జర ఆగండోయ్..! ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తొలిసారి ఉమ్మడి సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ చరిత్రాత్మక సభకు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. ఇక ఇదే సభలో బాలయ్య పేరు నెట్టింట్లో మార్మోగుతోంది. అబ్బో.. ఏ రేంజ్‌లో అంటే ఎంత తక్కువ చెప్పుకున్నా తక్కువేనేమో అన్నంతలా చర్చనీయాంశమయ్యారు బాలయ్య.
ఏం జరిగింది..?
ప్రజా గళం సభావేదికపై ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు మరో 27 మంది పెద్దలు ఆశీనులయ్యారు. ఇందులో నందమూరి బాలయ్య కూడా ఉన్నారు. ఈయనకు కూడా ప్రసంగం చేసే అవకాశం దక్కింది. గట్టిగానే సినిమాను మించి డైలాగ్స్ పేల్చారు. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ.. వేదికపై పెద్దలు మోదీ ఉండటంతో అందరూ చాలా డిగ్నిటీగా.. హుందాతనంగా ప్రవర్తించారు. కానీ బాలయ్య మాత్రం అందరితో నాకేంటి.. నేను వేరు.. నా రూటే వేరు.. బ్లడ్, బ్రీడ్ వేరు అన్నట్లుగానే అక్షరాలా ప్రవర్తించారు. ఇదిగో ఈ ఫొటోను కాస్త నిశితంగా పరిశీలిస్తే బాలకృష్ణ ఏం చేశారో మీకే అర్థమవుతుంది. కాలి మీద కాలు వేసుకుని కూర్చున్నారు. ప్రధాని పదవిలో మోదీ ముందు ఇలా కూర్చోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వయసులో పెద్దాయన, పైగా ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ముందు ఇలా కూర్చోవడాన్ని ఏమనాలి..? బీజేపీ, జనసేన.. కొందరు టీడీపీ కార్యకర్తలు సైతం సోషల్ మీడియా వేదికగా బాలయ్యను బంతాట ఆడుకుంటున్నారు.
లెక్కలేదేం బాలయ్యా!
మోదీ అంటే గౌరవం లేదు అనుకోండి.. కనీసం స్టేజీపై ఉన్న బావ చంద్రబాబు అన్నా లెక్కలేదా..?. బాలయ్య చేష్టలతో అక్కడ అందరికీ అవమానం జరిగిందన్నట్లుగా బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్న పరిస్థితి. అన్నగారు ఎన్టీఆర్ అంతటి పెద్ద కుటుంబం నుంచి వచ్చిన మీకు ఎవరితో ఎలా ప్రవర్తించాలనేది మినిమిమ్ తెలియకపోతే ఎలా..? అని సోషల్ మీడియా వేదికగా సామాన్యుడు మొదలుకుని నేతల వరకూ ప్రశ్నిస్తున్నారు. ఎంత అలవాటు అయితే మాత్రం ఇలా ఎవరి ముందు పడితే వారి ముందు ప్రవర్తించడం సబబు కాదని చెబుతున్నారు. ఇదేమైనా ఇంటర్వ్యూ అనుకున్నారా.. లేకుంటే సినిమా షూటింగ్ అనుకుంటున్నారా..? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఎంతసేపూ మేం వేరు, మా బ్లడ్, బ్రీడ్ అని చెప్పుకునే బాలయ్య.. వేరు అనే దానికి అర్థమిదేనా అంటూ తిట్టిపోస్తున్నారు. అయినా బాలయ్యకు ఇదేం కొత్త కాదు.. ఇదివరకూ మోదీ సభలోనూ ఇలాగే ప్రవర్తించారు.. నాటికి.. నేటికీ బలుపు తగ్గలేదన్నట్లుగా బీజేపీ కార్యకర్తలు విమర్శిస్తుండగా.. అబ్బే.. చెప్పాం కదా మేం వేరు అని నందమూరి అభిమానులు మాత్రం గర్వంగా, ధీమాగా చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు సబబో బాలయ్యకే తెలియాలి మరి.