అవును.. పవన్-వర్మ కలిసిపోయారు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం టీడీపీ-జనసేన పార్టీల్లో ఠారెత్తించిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటనతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. తనకు సీటుకు దక్కలేదని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ తీవ్ర మనస్తాపానికి గురవ్వడం.. అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోయి వీరంగం సృష్టించడం.. ఆఖరికి చంద్రబాబు, పవన్, లోకేష్‌పై పచ్చిబూతుల వర్షం కురిపించిన పరిస్థితి. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు సేనాని-వర్మ కలిసిపోయారు.. అంతా కూల్ అయిపోయింది. ఆందోళనలు మొదలుకుని ఇండిపెండెంట్‌గా పోటీచేస్తానంత వరకూ వచ్చిన వ్యవహారానికి ఫుల్‌స్టాప్ ఎక్కడ పడింది..? వర్మ ఎక్కడ కమిట్ అయ్యారు..? ఆయనకొచ్చిన హామీ ఏంటనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
ఎలా సాధ్యమైంది..?
ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అధికారంలోకి రానివ్వకూడదన్నదే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి టార్గెట్. ఇందుకోసం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంటోంది కూటమి. ఈ పరిస్థితుల్లోనే గోదావరి జిల్లాలను తొలుత ఎంచుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరిలో జిల్లాను క్లీన్ స్వీప్ చేయడానికి వ్యూహ రచన చేసింది. ఇందులో భాగంగానే పవన్ పిఠాపురం ఎంచుకోవడం జరిగింది. సేనాని ఇక్కడ్నుంచి పోటీచేస్తే.. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో గెలవచ్చన్నది టార్గెట్ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా కాపు సామాజిక వర్గం కూడా 75 శాతం ఉండటంతో కచ్చితంగా గెలవచ్చన్నది ప్లాన్. అయితే.. తనకు కంచుకోటగా మలుచుకున్న వర్మ మాత్రం అందుకు మొదట అంగీకరించలేదు.. కానీ చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పిలిపించి సర్దిచెప్పడంతో కూల్ అయ్యారు వర్మ. పనిలో పనిగా ఆయనకు కీలక హామీలు ఇవ్వడంతో పాటు.. సముచిత స్థానం ఇస్తానని మాటిచ్చారు కూడా.
పిఠాపురం కాదు.. మరో హైదరాబాద్!
కూటమి గెలిచి తాను ముఖ్యమంత్రి అయ్యాక పిఠాపురంను మరో హైదరాబాద్‌లా అభివృద్ధి చేస్తానని వర్మకు చంద్రబాబు మాటిచ్చారు. అంతేకాదు.. ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంచి భవిష్యత్తు ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతోపాటు పిఠాపురం రైతుల కన్నీళ్లు తుడుస్తానని.. ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇస్తానని వర్మకు చంద్రబాబు చెప్పగా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. బాబుతో భేటీ అనంతరం మీడియా ముందుకొచ్చిన సత్యనారాయణ వర్మ.. పవన్ కళ్యాణ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు. పవన్ పిలిస్తే వెళ్లి కలుస్తానని కూడా చెప్పారు. ఆ వెంటనే జనసేనాని నుంచి పిలుపొచ్చింది.. నేరుగా పవన్‌ను కలిసి చేతులు కలిపారు. ప్రశాంతంగా మాట్లాడుకుని ఫొటోలు కూడా దిగారు. చూశారుగా.. రాజకీయాల్లో శత్రువులు ఉండరు.. సమయం, సందర్భాన్ని బట్టి ఆళ్లు.. వీళ్లవుతారన్నది ఈ సీన్‌తో తెలిసిందిగా. ప్రస్తుతం నెట్టింట్లో చంద్రబాబు, పవన్‌తో వర్మ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.. అవును ఆయన రాజీపడ్డారని కొందరు.. పవన్-వర్మ కలిసిపోయారు.. ఇక వార్ వన్‌సైడ్ అయినట్లేనని ఇంకొందరు అభిమానులు, పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నాయి. ఈ కలయిక పవన్‌ను ఎంతవరకు గెలిపిస్తుందో చూడాలి మరి.