కవిత తర్వాత టార్గెట్ ఏపీ!
దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హుటాహుటిన హస్తిన నుంచి రావడం.. నాలుగైదు గంటలపాటు ఈడీ, ఐటీ రెండు దర్యాప్తు సంస్థలూ జాయింట్‌గా సోదాలు నిర్వహించి ఆఖరికి అరెస్ట్ చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లో చాలా మందే నిందితులు ఉన్నారన్న విషయం తెలిసిందే. అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే.. ఆయన కేబినెట్‌లోని కీలకనేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కేంద్రంలోని మోదీ సర్కార్.. దర్యాప్తు సంస్థలను ఇష్టానుసారం ప్రతిపక్షపాలు, ప్రాంతీయ పార్టీలపైకి ఉసిగొల్పుతోందని కక్షపూరిత చర్యలేనని.. ఇంకెన్నాళ్లీ టార్గెట్ చేస్తుందంటూ బీజేపీపై దేశ వ్యాప్తంగా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి. ఇంతవరకూ అంతా ఓకే గానీ.. కవిత తర్వాత ఎవరు..? దర్యాప్తు సంస్థలు ఎవర్ని టార్గెట్ చేయబోతున్నాయ్..? ఇటు ఏపీనా.. అటు ఢిల్లీనా..? ఇప్పుడిదే చర్చ జరుగుతోంది.
ఏపీని టచ్ చేస్తుందా..?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈడీ తదుపరి టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అని తెలుస్తోంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేయడానికి దాదాపు రంగం సిద్ధమైందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఒకట్రెండు రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్న మాగుంట.. కవిత అరెస్టుతో ఒక్కసారిగా కంగుతిన్నారట. ఎందుకంటే.. ఇప్పటికే పలుమార్లు ఎంపీ మాగుంటతో పాటు.. కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ విచారించడం, రాఘవను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అప్పట్లో ఇది వైసీపీకి పెద్ద తలనొప్పిగానే మారింది. మరోవైపు.. వైసీపీ అగ్రనేత, ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి కూడా అరెస్టయ్యి బెయిల్ మీద బయటికి వచ్చిన వారే. అయితే ఢిల్లీ లిక్కర్ కేసును వీలైనంత త్వరగా కొలిక్కి తెచ్చి.. ముగింపు పలకాలని దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.. అయినప్పటికీ కోర్టులు, తీర్పులతోనే వాయిదాలు పడుతూ వస్తోంది.
ఇక తగ్గేదేలే అన్నట్లుగా ఈడీ తెలంగాణలో దిగడం.. కోర్టులో కవిత పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని సుప్రీంకు హామీ ఇచ్చి మరీ ఉన్నపళంగా అరెస్ట్ చేయడంతో ఇక మా సంగతేంటి అని.. మాగుంట, శరత్ చంద్రారెడ్డి ఇరువురూ భయపడిపోతున్నారట. అప్రూవర్‌గా మారిన వారిలో సైతం ఆందోళన మొదలైందట. ఒకట్రెండు రోజుల్లో ఈడీ ఏపీకి కూడా రావొచ్చని తెలుస్తోంది. దీంతో టీడీపీ అగ్రనేతలు అలర్ట్ అయినట్లుగా సమాచారం. అసలే టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుగా ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు రంగంలోకి దిగి.. ఈ సోదాలు, అరెస్టులు ఆపగలరా అనేది చూడాల్సి ఉంది.
ఢిల్లీ సంగతేంటి..?
రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ.. దేశ రాజధాని ఢిల్లీని మాత్రం టచ్ చేయలేకపోయింది. వరుసగా ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. దీనికి కారణాలేన్నో చెబుతుంటారు విశ్లేషకులు. అయితే.. అవినీతికి ఆమడ దూరంలో ఉంటూ వస్తున్న అరవింద్ మెడకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చుట్టుకుంది. దీంతో ఎప్పుడు కేజ్రీవాల్ సర్కార్ కుప్పకూలుతుందో తెలియని పరిస్థితిగా మారింది. ఓ వైపు డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియాను ఇదే కేసులో అరెస్టు చేసి ఈడీ, సీబీఐ ముప్పు తిప్పలు పెడుతోంది. ఇక లిక్కర్ కేసుకు ఆధ్యుడు కేజ్రీవాలేనని ఆయన్ను విచారణ చేస్తే అన్నీ కొలిక్కి వస్తాయన్నది ఈడీ అభిప్రాయం.
ఇందులో భాగంగానే దాదాపు ఎనిమిదిసార్లు ఈడీ సమన్లు జారీ చేసినప్పటికీ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. కోర్టుకు వెళ్లడం స్టే తెచ్చుకోవడం లాంటివి చేస్తూ వచ్చారు. సీన్ కట్ చేస్తే మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుకావాల్సిందేనని.. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. కేజ్రీవాల్ విచారణకు వస్తే.. రెండ్రోజులపాటు విచారించి ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కేజ్రీ సర్కార్‌ను ముప్పు తిప్పలు పెట్టొచ్చన్నది కేంద్రం భావనగా ఆప్ చెబుతోంది. మరి ఫైనల్‌గా ఈడీ రూటెటు.. అటు ఆంధ్రాకు వెళ్తుందా.. ఇటు ఢిల్లీలోనే వ్యవహారం నడిపిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే మరి.