కవితకు ఈడీ స్ట్రోక్.. ముందే ఊహించిన కేసీఆర్!
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు ఈడీ రూపంలో ఊహించని ఝలక్ తగిలింది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అటు ఇటు జంప్ అవ్వడంతో సతమతమవుతున్న బీఆర్ఎస్‌కు.. దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ హైదరాబాద్‌కు వచ్చి మరీ షాకిచ్చాయి. గులాబీ బాస్ కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన 10 మందితో కూడిన బృందం.. ఐటీ అధికారులతో కలిసి సోదాలు చేస్తోంది. గత పదేళ్లుగా నడిచిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ వివరాలు సేకరిస్తోంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని నాళ్లు ఏమేం జరిగిందనే దానిపై ఆరాతీస్తోందన్న మాట. కవితతో పాటు ఆమె భర్తకు సంబంధించిన లావాదేవీలపై కూడా ఈడీ ఆరాతీస్తోంది. ఇప్పటికే కవిత, ఆమె భర్త.. సహాయకుల ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు, వీరాభిమానులు, కవిత అనుచరులు పెద్ద ఎత్తున నివాసానికి చేరుకుంటున్నారు.
ఎందుకీ సోదాలు..?
దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత నిందితురాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారణ జరపడం.. కాస్త గ్యాప్ ఇవ్వడం మళ్లీ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని పిలిచినప్పటికీ కవిత హాజరుకాలేదు. పైగా.. తనపై చర్యలు తీసుకోకుండా ఈడీని ఆదేశించాలని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ కూడా వేసింది. ఈ విచారణ ఒకసారి జరగ్గా.. ఈనెల 19వ తారీఖుకు మళ్లీ వాయిదా పడింది. ఈ గ్యాప్‌లోని ఇలా ఈడీ, ఐటీ ఒక్కసారిగా జాయింట్ సోదాలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇవాళ, రేపు రెండ్రోజులూ సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సోదాలతో బీఆర్ఎస్‌కు ఎన్నికలకు భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు.
కేసీఆర్ ముందుగానే..?
ఢిల్లీ లిక్కర్ కేసులో కచ్చితంగా కవితను ఇబ్బంది పెడతారని కేసీఆర్ ముందుగానే ఊహించారని తెలుస్తోంది. ఎందుకంటే కేసు ఇంకా నడుస్తుండటం.. ఎప్పుడేం జరుగుతుందో తెలియకపోవడంతో కవితను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టలేదని సమాచారం. నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీచేయాలని కవిత మనసులో ఉన్నప్పటికీ ఈ పరిస్థితుల రీత్యా పోటీకి దూరంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో లేదు గనుక ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని.. అసలే పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని కేసీఆర్ పసిగట్టి.. కవితకు వివరించారట. దీంతో నిజామాబాద్ స్థానం నుంచి వేరొకర్ని బరిలోకి దింపడానికి బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది.