బిగ్ బాస్ సీజన్ 7 లో రైతు బిడ్డగా అడుగుపెట్టి అభిమానులని సంపాదించుకుని.. హౌస్ లో అలాగే బయట కూడా సింపతీ క్రియేట్ చేసుకున్నాడు. తానొక రైతు ని అని తాను గనక బిగ్ బాస్ ట్రోఫీ గెలిస్తే ప్రైజ్ మనీని మిగతా రైతులకి ఇస్తా అంటూ చెప్పుకొచ్చాడు. అదే సింపతితో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ట్రోఫీని గెలిచాడు. శివాజీ సహకారంతో విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ స్టేజ్ పై ఆ మనీని పేద రైతుల కోసం ఖర్చు పెడతా అని మాటిచ్చాడు. ఆ తర్వాత బయటికి రాగానే అభిమానులు చేసిన రచ్చ, రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ ఇచ్చిన బిల్డప్ తో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు.
బిగ్ బాస్ లో చూపించిన పొగరు మొత్తం జైలుకెళ్లొచ్చాక పల్లవి ప్రశాంత్ లో దిగిపోయింది. ఆ తర్వాత పెద్దగా కనిపించకపోయినా స్టార్ మా షోస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అయితే సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ విన్నరయితే ప్రైజ్ మనీని రైతులకి ఇస్తా అన్నావ్.. ఇప్పుడు జాలిగా తిరుగుతున్నావ్ అంటూ ట్రోల్ చెయ్యడం మొదలు పెట్టారు. విన్నర్ అయ్యేవరకు బిల్డప్ ఇచ్చావ్, అయ్యాక సైలెంట్ అయ్యావ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కానీ పల్లవి ప్రశాంత్ తన మాట నిలబెట్టుకున్నాడు. మాట ప్రకారం రైతులకి తొలి సాయాన్ని అందజేశానంటూ గర్వంగా చెప్పుకొచ్చాడు.
అందుకు సంబంధించిన వీడియోను పల్లవి ప్రశాంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో పల్లవి ఫ్రెండ్స్ శివాజీ, భోలే షావలి, ఆట సందీప్ కూడా ఉన్నారు. శివాజీ చేతుల మీదుగా ఓ రైతు కుటుంబానికి రూ. లక్ష ఇప్పించాడు ప్రశాంత్. అలానే ఒక సంవత్సరానికి సరిపడా బియ్యం కూడా అందజేశాడు. ఇదే విషయాన్ని పోస్ట్ చేస్తూ ప్రాణం పోయినా మాట తప్పను.. మీకు ఇచ్చిన మాట కోసం ముందుగా చేసిన సహాయం అంటూ చెప్పుకొచ్చాడు. మీ ప్రోత్సాహంతో మరింత మందికి సాయం చేస్తాను అంటూ ఆ వీడియోలో చెప్పాడు. అంతేకాకుండా తనతో ఆప్తుగా సందీప్ మాస్టర్ రూ. 25 వేలు సాయం చేశారంటూ ప్రశాంత్ తెలిపాడు. ఇక ఈ వీడియోలో శివాజీ మాట్లాడుతూ.. ఈ డబ్బును మీ పిల్లల పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తారు.. అది వాళ్ల పెళ్లి సమయానికి ఉపయోగపడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.