సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. తన సత్తా ఏంటో చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు.. ఇలా పలు విషయాలపై వీవీ చాలా రోజులుగా పోరాటమే చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి ఏమేం కావాలో అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానుండటంతో ఈ పార్టీకి ఎన్నికల సాధారణ గుర్తుగా టార్చి లైట్ గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించింది. ఈ గుర్తుపైనే అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు బరిలోకి దిగొచ్చు. పార్టీ పెట్టడం, సింబల్ దక్కించుకోవడం వరకూ ఓకే.. ఈ లైట్ ఏ మాత్రం వెలుగుతుంది.. అదేనండోయ్.. ఎన్ని సీట్లు గెలుస్తుంది.. అసలు పార్టీ అధినేత లక్ష్మీనారాయణ అయినా గెలుస్తారా..? అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నడుస్తున్న చర్చ.
పోటీ ఎక్కడ్నుంచి..?
ఇంతవరకూ వీవీ ఎక్కడ్నుంచి పోటీచేస్తారనే దానిపై క్లారిటీ అయితే రాలేదు కానీ.. అనధికారికంగా మాత్రం వైజాగ్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తారని మాత్రం గట్టిగానే టాక్ నడుస్తోంది. పైగా ఫోకస్ అంతా ఈ పార్లమెంట్ స్థానంపైనే పెట్టారాయన. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన తరఫున ఎంపీగా పోటీచేసిన లక్ష్మీనారాయణ కచ్చితంగా గెలుస్తారని అందరూ భావించారు కానీ.. సీన్ కట్ చేస్తే మూడో స్థానానికే పరిమితం అయ్యారు. వీవీకి 2,88,874 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఎంపీగా గెలుపొందారు. మెజార్టీ మీద మాత్రం గట్టిగానే ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. కేవలం 4,414 ఓట్లతోనే ఎంవీవీ గట్టెక్కారు. ఇక.. టీడీపీ తరఫున పోటీచేసిన నందమూరి బాలయ్య అల్లుడు మతుకుమల్లి భరత్ 4,32,492 ఓట్లు దక్కించుకున్నారు. దీంతో వీవీ తొలిసారి పోటీచేసిన పార్లమెంట్ స్థానంలో ఓడిపోయారు. అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలిచినా గెలవకపోయినా కచ్చితంగా వీవీ గెలుస్తారని అప్పట్లో గట్టిగానే టాక్ నడిచినప్పటికీ అదేమీ వర్కవుట్ అవ్వలేదు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటికి వచ్చేయడం.. రైతుల కోసం పోరాటం చేయడం.. ఇప్పుడు ఏకంగా ప్రత్యేక పార్టీనే పెట్టడం జరిగింది.
ఏం జరుగుతుందో..?
పోయిన చోటే వెతుక్కోవాలన్నది పాత సామెత గుర్తుంది కదా.. ఓడిన చోటే గెలిచి నిలిచి చూపించాలని లక్ష్మీనారాయణ గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. పైగా గత ఎన్నికల్లో ఓడామన్న సెంటిమెంట్, అంతా ఎడ్యుకేటెడ్ ఓటర్లు ఉండటంతో ఈసారి కచ్చితంగా కరుణిస్తారని ధీమాతో ఉన్నారట. అయితే.. వీవీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండానే ఒంటిరిపోరు చేస్తున్నారు. ఈయన బరిలోకి దింపే వ్యక్తులు సైతం చదువుకున్న, వివిధ రంగాల్లో పేరుగాంచిన వ్యక్తులు ఉంటారని తెలుస్తోంది. అభ్యర్థులను వెతికే పనిలో ప్రస్తుతం ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. వీవీ నిలబెట్టే అభ్యర్థుల సంగతి అటుంచితే.. వైజాగ్ నుంచి పోటీ చేసి గెలుస్తానన్న నమ్మకం, ధీమా ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి మరి.