అవును.. అసలే సీట్ల పంపకాలు, గెలుపు వ్యూహాల విషయంలో నానా తిప్పలు పడుతున్న టీడీపీ-జనసేన-కూటమి నెత్తిన ఊహించని రీతిలో పిడుగు వచ్చి పడింది!. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎక్కడ చూసిన పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ పౌరసత్వ సవరణ చట్టం (CAA సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్) గురించే. కేంద్రంలోని మోదీ సర్కార్ తెచ్చిన ఈ చట్టమే ఇప్పుడు కూటమికి పెద్ద మైనస్‌గా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు చెబుతున్న మాట. నాలుగేళ్ల కిందట సీఏఏ విషయంలో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా నాడు టీడీపీ, వైసీపీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.. అడ్డుకుంటామని హెచ్చరించాయి కూడా. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మైనార్టీలు పెద్ద ఎత్తునే ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు తెలియజేశారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇటు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ సీఏఏను అడ్డుకుంటామని మైనార్టీలకు మాటిచ్చారు. నాడు బహిరంగ సభల్లో కూడా జగన్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సపోర్ట్ చేసే పరిస్థితే లేదని చెబుతూ వచ్చారు. సీన్ కట్ చేస్తే.. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ చేరిపోయింది. దీంతో చంద్రబాబు పరిస్థితి ముందు నొయ్యి.. వెనుక గొయ్యి లాగా ఉంది. మైనార్టీలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో టీడీపీ, జనసేన పార్టీలు ఉండటం గమనార్హం. ఇక బీజేపీకి రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.. ఎందుకంటే పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే గనుక.
ఇలా జరిగిందేంటో..!
వాస్తవానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై ఆధారపడుతూ వచ్చిన టీడీపీ, జనసేన పార్టీలకే సీఏఏ తలనొప్పిగా మారిన పరిస్థితి. ఎందుకంటే ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే గెలుపును డిసైడ్ చేసే పరిస్థితి ఉంది. గోదావరి జిల్లాల్లో తప్పితే.. మిగిలిన అన్ని చోట్లా వేలు మొదలుకుని లక్షల సంఖ్యలో మైనార్టీల ఓట్లు ఉన్నాయి. దీంతో మైనార్టీలకు ఏం చెప్పి ఓట్లు అడగాలో తెలియక కూటమి పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టణ ప్రాంతాల్లో 60 నుంచి 70 శాతం వరకూ ముస్లింల జన సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ ఓట్లన్నింటినీ కూటమి కోల్పోయే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయని టీడీపీ, జనసేన ముఖ్యనేతలు గుసగుసలాడుకుంటున్నారు. సరిగ్గా ఎన్నికల ముందు ఈ చట్టాన్ని తీసుకురావడంతో ఎటూ కాని పరిస్థితిగా మారిపోయింది. ఇదంతా పరోక్షంగా వైసీపీకి లబ్ధి చేకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకూ మైనార్టీల్లో కాస్తో.. కూస్తో వ్యతిరేకత ఉందని అధికార పార్టీ భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ఆ సందేహాలు ఉండనక్కర్లేదని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మైనార్టీలు తమవైపే అని.. గంపగుత్తగా టీడీపీ, జనసేన పార్టీలకే ఓట్లు పడతాయని భావిస్తున్న పరిస్థితుల్లో కేంద్రం చేసిన ఈ ఒక్క పొరపాటుకు సీన్ మొత్తం రివర్స్ అయ్యిందని విశ్లేషకులు చెబుతున్న మాట. పోనీ.. మైనార్టీలకు ఎలాంటి భరోసా ఇవ్వొచ్చో కూడా తెలియక డైలామాలో పడ్డారట నేతలు.
కమలం ఆటకు బలి!
ఎన్నికల ముందు సీఏఏను పొలిటికల్ గేమ్ కోసమా..? చాలా కాలంగా డిమాండ్ ఉందని తీసుకొచ్చిందా..? అనేది పక్కనెడితే ఇది మాత్రం ఏపీలో కూటమికి పెద్ద దెబ్బే. అయితే బీజేపీ మాత్రం.. హింసకు గురవుతున్న మైనారిటీలకు ఇండియాలో సీఏఏ ద్వారా పౌరసత్వం రానుందని కేంద్రం చెబుతున్నప్పటికీ.. ఈ పరిస్థితులను ప్రజలు నమ్మేలా లేరన్నది జగమెరిగిన సత్యమే. ఇప్పటికే ఈ చట్టాన్ని మజ్లిస్‌తో పలు రాష్ట్రాల్లోని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీఏఏపై అభ్యంతరాలు అలాగే ఉన్నాయని, ముస్లింలే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ లాంటి నేతలు చెబుతున్నారు. సీఏఏ అనేది విభజన వాదం అని.. ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించాలని కోరుకునే గాడ్సే ఆలోచనను ప్రతిబింబిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. హింసకు గురైన ఎవరికైనా ఆశ్రయం ఇవ్వండి కానీ, మతం లేదా జాతీయతపై పౌరసత్వం ఆధారపడి ఉండకూడదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సీఏఏపై టీడీపీ, జనసేన పార్టీలు ఎలా ముందుకెళ్తాయో.. అసలు మైనార్టీ సోదరులకు ఎలాంటి హామీలు ఇస్తాయో అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి చూస్తే.. ఇది మాత్రం కూటమి నెత్తిన పెద్ద పిడుగే అని చెప్పుకోవచ్చు.. ఈ భారీ పిడుగు నుంచి టీడీపీ, జనసేన ఎలా తప్పించుకుంటాయో.. వేచి చూడాల్సిందే మరి.