ఉన్నదీ పాయె.. ఉంచుకున్నదీ పాయే అన్నట్టుగా ఉంది ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారం. సమయాన్ని దొరకబుచ్చుకుని మరీ వైసీపీని, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. ఆ తరువాత జైలు పాలై దెబ్బలు కూడా తిన్నారు. ఇక అప్పటి నుంచి ప్రెస్‌మీట్ల జోష్ పెంచేశారు. ప్రతిరోజూ ప్రెస్‌మీట్ పెట్టడం.. మా పార్టీ అధినేత అంటూ విమర్శలు గుప్పించడం వంటివి చేశారు. ఆ తరువాత వైసీపీకి రాజీనామా చేశారు. నిన్న మొన్నటి వరకూ పొత్తులో భాగంగా నర్సాపురం టికెట్ ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ తరుఫున పోటీ చేస్తానంటూ మీడియా ముఖంగా చెప్పారు. అది పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లిపోయింది. అయితే బీజేపీ మాత్రం ఆ స్థానాన్ని కృష్ణంరాజు కుటుంబానికి ఇస్తారట.
సిట్టింగ్ స్థానం బీజేపీకి..
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా జనసేన 2 ఎంపీ సీట్లకే పరిమితం కాబోతోంది. బీజేపీ కోసం ఆ పార్టీ ఒక ఎంపీ సీటును త్యాగం చేసింది. అయితే రానున్న ఎన్నికల్లో ఈ మూడు పార్టీలో ఏదో ఒక పార్టీ తరుఫున పోటీ చేయాలని రఘురామ భావించారు. ఆయన సిట్టింగ్ స్థానమొచ్చేసి బీజేపీకి వెళ్లిపోయింది. దీంతో బీజేపీ తరుఫున పోటీ చేయాలని భావించారు. కానీ కమలం పార్టీ మాత్రం ఆ సీటును బీజేపీ మాజీ ఎంపీ కృష్ణంరాజు భార్య శ్యామల దేవికి.. లేదంటే హీరో ప్రభాస్ సోదరుడు నరేంద్ర వర్మకు ఇవ్వాలని యోచిస్తోందట. ఇప్పటికే వారిద్దరితో బీజేపీ నేతలు మాట్లాడారని కూడా ప్రచారం జరుగుతోంది. అంగీకరిస్తే వారిద్దరిలో ఒకరికి నర్సాపురం ఎంపీ టికెట్ ఇస్తారట.
ఆశలన్నీ అడియాశలు..
అంతా బాగానే ఉంది కానీ ప్రస్తుతం రఘురామ పరిస్థితేంటి? వైసీపీతోనూ కొరివి పెట్టుకున్నారు. ఇటు బీజేపీ కూడా టికెట్ ఇచ్చేలా లేదు. ఒకవేళ ఏదైనా పార్టీ ఇచ్చినా కూడా ఆయన గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే వైసీపీ ఎంపీగా గెలిచిన తర్వాత కొన్నేళ్ల పాటు సొంత నియోజకవర్గంలో ఆయన అడుగు పెట్టింది లేదు. వైసీపీకి భయపడో ఏమో కానీ నర్సాపురం వంకే చూడలేదు. కనీసం ఎంపీగా చేపట్టాల్సిన పనులు కూడా చేసింది లేదు. అందుకేనేమో కమలం పార్టీ కూడా రఘురామను పక్కనబెట్టి కృష్ణంరాజు కుటుంబ సభ్యుల పేర్లను పరిశీలిస్తోంది. మొత్తానికి నర్సాపురం టికెట్‌పై రఘురామ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు కాబోతున్నాయని తెలుస్తోంది. కనీసం వైసీపీతో వైరం పెట్టుకోకున్నా తిరిగి జగన్ ఆ స్థానాన్ని ఆయనకే కట్టబెట్టేవారమో.. ఇప్పుడు రఘురామ ఏం చేస్తారో చూడాలి.