తెలంగాణ రాజకీయాల్లో మార్చి 12వ తేదీ బీభత్సమైన పొలిటికల్ హీట్‌ను పెంచేస్తోంది. తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్‌లోనే ఈ డే బిగ్ డేగా నిలవబోతోంది. అసలే తెలంగాణ ఇటీవలి కాలంలో ప్రతి విషయంలోనూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. బీఆర్ఎస్ రోజురోజుకూ పతనమవుతున్న తీరు.. బీజేపీ పుంజుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్న వైనం.. అలాగే కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా దూసుకెళుతున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో విజయం తమదేనని బీజేపీ బల్లగుద్ది మరీ చెబుతున్నా కూడా అది పోటీ పడేది రెండో స్థానానికేనని అందరికీ తెలిసిందే. ఇక బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతోంది.
మెజారిటీ స్థానాలు కాంగ్రెస్‌వే..
ఈ క్రమంలోనే ఒకేరోజు రంగంలోకి అమిత్ షా, రేవంత్ రెడ్డి, కేసీఆర్ దిగనున్నారు. మార్చి12న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు తెలంగాణలో పోటా పోటీగా సభలు నిర్వహించనున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా తెలంగాణను క్లీన్ స్వీప్ చేసేయాలన్న లక్ష్యంతో ఉంది. అదైతే సాధ్యపడదు కానీ మెజారిటీ స్థానాలైతే కాంగ్రెస్ ఖాతాలో పడటం ఖాయం. ఇక ఇప్పుడు రూ.500కే సిలిండర్.. 200 యూనిట్ల లోపు అయితే పవర్ బిల్ కట్ వంటివి సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇది పార్లమెంటు ఎన్నికల్లో బాగానే వర్కవుట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభంజనాన్ని అడ్డుకుని కొన్ని సీట్లు అయినా ఖాతాలో వేసుకోవాలని బీజేపీ, బీఆర్ఎస్‌లు కాస్త గట్టిగానే శ్రమిస్తున్నాయి.
ఎన్నికల కోడ్ రాకముందే..
ఈ క్రమంలోనే షెడ్యూల్‌కు ముందే పార్టీలన్నీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నాయి. అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలతో సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచేశారు. మంగళవారం పరేడ్ గ్రౌండ్‌లో సీఎం రేవంత్ మహిళా శక్తి సభ.. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎన్నికల కోడ్ రాకముందే అనుకున్న పథకాలన్నింటినీ రేవంత్ శరవేగంగా లాంచ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ కథన భేరి బహిరంగ సభను నిర్వహించనున్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వ వైఖరి ఎండగట్టి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయనున్నారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చేసి ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించనునున్నారు. అనంతరం పార్టీ బూత్ లెవల్ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ఈ ఒక్క రోజు మూడు ప్రధాన పార్టీల సభలతో పొలిటికల్ హీట్ బీభత్సంగా పెరిగిందనే హింట్ ఈ డే తెలియజేస్తోంది.