వైస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తలపెట్టిన సిద్ధం సభ బాపట్ల జిల్లాలోని మేదరమెట్లలో ఈరోజు ఆదివారం జరిగింది. ఈ సభకి తరలి వచ్చిన వైసీపీ కార్యకర్తలు, ప్రజల నడుమ సిద్ధం సభా ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. సిద్ధం సభ ముగిసి సీఎం జగన్ రెడ్డి వెళ్లిపోయిన తర్వాత సభ ప్రాంగణం నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందగా, మరొకరు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతుడు ఒంగోలు బలరాం కాలనీకి చెందిన మురళీగా గుర్తించారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. అయితే సిద్ధం సభ ప్రాంగణం వద్ద మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టినట్టు గా తెలుస్తోంది. దానితో ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మరోపక్క సిద్ధం కోసం ఏర్పాటు చేసిన బస్సు కిందపడి మరొకరు మృతి చెందారు. సిద్ధం సభకు వెళ్లి వస్తుండగా మరో యువకుడు మృతి చెందాడు. గోపాలపురం మలుపు వద్ద బస్సులో నుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన గేదెల బాలదుర్గగా గుర్తించారు. సభకు హాజరై తిరిగి వస్తుండగా బస్సు ముందు డోర్ వద్ద నిల్చొని ఉన్న బాలదుర్గ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. బస్సు వెనుక చక్రాలు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు సభలో ఓ ఏఎస్సైకి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.