ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యర్థులకు ఆలోచనలకు అందకుండా వ్యూహాలను మార్చేసుకుంటున్నారు. అసలు తను ఎక్కడి నుంచి పోటీ చేసేది తెలుసుకోవడం ప్రత్యర్థులకు కష్టంగా మారింది. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఆ స్థానంలో గట్టి అభ్యర్థిని బరిలోకి దింపి మరోసారి ఆయనను ఓడించాలని భావిస్తోంది. తొలుత భీమవరం నుంచి పవన్ పోటీ అన్నారు. కానీ ఆ వెంటనే వ్యూహం మార్చేసుకున్నారు. అక్కడి నుంచి అంజిబాబును బరిలోకి దింపాలని భావించారు.
పవన్ ఆలోచనలో గాజువాక?
నిజానికి అంజిబాబు టీడీపీ నేత.. ఆయనను జనసేనలో చేర్చుకుని తమ పార్టీ తరుఫున పోటీ చేయాలని పవన్ భావించారు. ఈ క్రమంలోనే ఆయనను మంగళగిరికి పిలిచి మాట్లాడారు.దీంతో భీమవరం నుంచి అంజిబాబు ఫిక్స్ అయినట్టేనని తెలుస్తోంది.ఇక ఆ తరువాత పవన్ పిఠాపురం నుంచి పోటీ అన్నారు. అంతా అక్కడి నుంచి పవన్ పోటీ పక్కా అనుకున్నారు. కానీ ఇప్పుడు అది కూడా కాదని అంటున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా కూడా పోటీ చేయాలని భావిస్తున్నారట. అలాగే పవన్ ఆలోచనలో గాజువాక ఉందట. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదుక్కోవాలని పవన్ భావిస్తున్నారట. అప్పటికీ.. ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయట. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో జనసేనకు బలం బీభత్సంగా పెరిగిందనడంలో సందేహం లేదు.
వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత..
ఒకరకంగా చెప్పాలంటే గాజువాక ప్రస్తుతం జనసేనకు కంచుకోటగా మారిపోయింది. పైగా ముందుగానే ఇరు పార్టీలు పోల్ మేనేజ్‌మెంట్‌ను ఇప్పటికే పూర్తి చేశాయి. ఈసారి గాజువాకను బద్దలు కొట్టేస్తారట. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పవన్ 50 వేల ఓట్లు మాత్రమే సాధించారు కానీ ఈసారి పరిస్థితులు అలా ఉండవు. పైగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. దీంతో పవన్ విజయం ఫిక్స్ అని తెలుస్తోంది. గాజువాక స్థానాన్ని ఈసారి జనసేన నేతలు సైతం ఛాలెంజ్‌గా తీసుకున్నారు. అయితే మరోవైపు పవన్ తిరుపతి నుంచి పోటీ చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. గతంలో ప్రజారాజ్యం తరుఫున చిరంజీవి అక్కడి నుంచి పోటీ చేయడంతో పవన్‌ను కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని కోరుతున్నారు. చివరకు పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.