ఎన్నికలకు ఈసీ కసరత్తు.. ఇటు రాజీనామా!
నెల.. రెండు నెలలుగా అదిగో ఇదిగో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తోందని వార్తలు వస్తున్నాయే తప్ప వచ్చిన దాఖలాల్లేవ్. అయితే ఈసారి మాత్రం కచ్చితంగా నోటిఫికేషన్ వస్తోందని ఎన్నికల సంఘమే ఒకింత లీకులు చేసింది. మార్చి-15న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి.. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటన రానుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పది రాష్ట్రాల్లో పైగా పర్యటించిన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌ల బృందం.. ఈ మేరకు త్వరలోనే షెడ్యూల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నోటిఫికేషన్‌కు లోపే ఈనెల 11న ఎన్నికల పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. మీటింగులో ఎన్నికలకు అయ్యే ఖర్చుకు సంబంధించి చర్చ జరగనుంది. ఆ తర్వాత 12, 13 తేదీల్లో జమ్ము కశ్మీర్‌లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించబోతున్నారు. ఆ మరుసటి రోజు (మార్చి-14) ఎన్నికల సన్నద్ధతపై నిశితంగా సమీక్షించి.. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
రాజీనామా ఎందుకో..?
అటు ఎన్నికల షెడ్యూల్‌కు తీవ్ర కసరత్తు జరుగుతున్న పీక్ టైమ్‌లో కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ఈ కీలక నిర్ణయాన్ని శనివారం రాత్రి ఆయన ప్రకటించారు. అంతేకాదు.. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగా తక్షణమే ఆమోదించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఈ విషయాన్ని కూడా ప్రకటిచింది. ఎన్నికల కమిషన్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలున్నారు. అటు కసరత్తు.. ఇటు రాజీనామాతో ఈసీలో ఏం జరుగుతోందనే చర్చ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నడుస్తోంది. గోయల్ రాజీనామాతో ఎన్నికల నిర్వహణపై తీవ్ర ప్రభావం ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు.
సడన్‌గా ఏం జరిగిందో..?
వాస్తవానికి అరుణ్ గోయల్ పదవీ కాలం 2027 వరకు ఉంది. ఈయనపై ఎలాంటి ఆరోపణలు కూడా లేవు. అయితే ఇంత సడన్‌గా అరుణ్ రాజీనామా ఎందుకు చేశారన్నదే ఎవరికీ అంతుపట్టని విషయం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గోయల్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడానికి బీజేపీ అగ్రనేతలు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలియవచ్చింది. ఇప్పటికే బీజేపీ పెద్దల నుంచి కబురు రావడంతో ఇలా రాజీనామా చేయాల్సి వచ్చిందనే టాక్ గట్టిగానే నడుస్తోంది. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు.. చేయాల్సిన పనులన్నీ చక్కబెట్టిన తర్వాతే రాజీనామా బయటికొస్తున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రూమర్లు ఎంతవరకు నిజమో.. రాజీనామా వెనుక ఏం జరిగిందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.