ఎట్టకేలకు పొత్తు ప్రకటన వచ్చేసింది..
హమ్మయ్య.. ఎట్టకేలకు పొత్తు ప్రకటన రానే వచ్చేసింది. ఎన్నో రోజులుగా టీడీపీ, జనసేనతో బీజేపీ కలవబోతోందంటూ ఎన్నో రోజులుగా టాక్ నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో భేటీ అయిన ప్రతిసారీ ప్రకటన రానుందంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ అదేమీ రాకపోవడంతో టీడీపీ, జనసేన నేతలు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. నేడు ఆ ప్రకటన రానే వచ్చింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఓ లేఖ ద్వారా అధికారిక ప్రకటన చేశారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ రోజే అధికారిక ప్రకటన వచ్చేస్తుందని అంతా ఆశించారు.
పోటీ చేయడం ఇదేమీ కొత్త కాదు..
కాగా.. నేడు మలివిడత చర్చలు జరిగాయి. చర్చల అనంతరం ఎవరికి వారు వెళ్లిపోవడంతో ఈసారి కూడా ప్రకటన రాదేమో.. ఆలస్యమవుతుందేమోనని అంతా భావించారు. కానీ ఈసారి బీజేపీ ఆలస్యం చేయలేదు. జేపీ నడ్డా ప్రకటన చేసేశారు. ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని లేఖలో నడ్డా వెల్లడించారు. బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయడం ఇదేమీ కొత్త కాదు. 1996లో ఎన్డీఏలో టీడీపీ జాయిన్ అయ్యింది. రాష్ట్రం విడిపోయాక అంటే 2014 ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేశాయి. కానీ 2019 ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేశారు. తిరిగి ఐదేళ్ల తర్వాత జనసేనతో కలిసి పొత్తు పెట్టుకున్నాయి. సుదీర్ఘ కాలం టీడీపీతో కలిసి పనిచేశామని జేపీ నడ్డా లేఖలో పేర్కొన్నారు. 2014లో టీడీపీ-బీజేపీ కలిసి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేశామని తెలిపారు. టీడీపీ పాత మిత్రపక్షమేనని.. ఒకటి రెండ్రోజుల్లో సీట్ల పంపకంపై క్లారిటీ ఇస్తామని వెల్లడించారు.
17న ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ..
కాగా.. ఎన్డీఏ ఫ్యామిలీలో చేరాలని చంద్రబాబు, పవన్‌ల నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని ట్విటర్ వేదికగా జేపీ నడ్డా పేర్కొన్నారు. దూరదృష్టి కలిగిన ప్రధాని మోదీ నాయకత్వంలో ఏపీ అభ్యున్నతి కోసం టీడీపీ, జనసేనలతో కలిసి పోటీ చేయనున్నట్టు వెల్లడించారు. ఈనెల 17న చిలకలూరిపేటలో నిర్వహించే 3 పార్టీల ఉమ్మడి బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని టీడీపీ చంద్రబాబు వెల్లడించారు. ఒకవేళ ప్రధాని షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే 18న సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించారని తెలిపారు. మొత్తానికి అధికారిక ప్రకటన రావడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు 2014 నాటి సీన్ తిరిగి రిపీట్ అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.