ఎలాగూ కుదరడమే లేదు.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి ఛాన్సేలేదు. ఒక్క ఛాన్స్‌కే పరిమితమయ్యేలా ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చేసి ఓట్లు రాబట్టుకుందామంటే ఈ సర్వేలు వైసీపీ నెత్తిన పిడుగుల్లా పడుతున్నాయి. ఓ వైపు వలంటీర్లను జనాల చేత ఓట్లు వేయించేలా సిద్ధం చేస్తోంది. మరోవైపు గ్రూపుల వారీగా ఇప్పటి నుంచే తాయిలాలు పంచుతోంది. ఇప్పటికే తాము మెచ్చే.. ఏది చెబితే అలా గుడ్డిగా ఫాలో అయ్యే అధికారులందరినీ తాము అనుకున్న స్థానాలకు ట్రాన్స్‌ఫర్ చేసింది. తాము తిరిగి అధికారంలోకి రాకుంటే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయంటూ ప్రచారం చేస్తోంది.
22 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్..
పోనీలే ఎలాగోలా ఈసారికి నెట్టుకు రావొచ్చులే అనుకుంటుంటే ఈ సర్వేలు తగలడా.. దెబ్బ మీద దెబ్బేస్తున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలు చాలక ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్’ అనే సంస్థ తాజాగా ఓ సర్వేను విడుదల చేసింది. ఏపీలో గెలిచి నిలిచేదెవరు? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరు? వంటి విషయాలను క్లియర్‌గా వివరించింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ.. టీడీపీ-జనసేన కూటమి 104 స్థానాలు.. వైసీపీ 49 స్థానాలు కైవసం చేసుకుంటుందట. అయితే వీటిల్లోనూ 22 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంటుందట. ఇక ఎంపీ స్థానాల్లోనూ కూటమిదే హవా అని సర్వే సంస్థ తేల్చింది.
అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు..
25 పార్లమెంట్ స్థానాలకు గానూ టీడీపీ-జనసేన కూటమి 18 స్థానాలను కైవసం చేసుకుంటుందని.. మిగిలిన 7 స్థానాలను వైసీపీ సొంతం చేసుకుంటుందని సర్వే సంస్థ తెలిపింది. ఓట్ల శాతం పరంగా కూడా వైసీపీ దారుణ పరిస్థితులనే ఎదుర్కొంటుందట. గత ఎన్నికల్లో 151 స్థానాలను గెలుచుకున్న వైసీపీ ఈసారి 49కి పడిపోవడమేంటి? కనీసం సీట్లు తగ్గినా అధికారం దక్కించుకోవాలి కదా అంటే ఏం చేసినా సరే వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని సర్వేలు తేలుస్తున్నాయి. ఈ సర్వే ఎప్పుడో చేసింది కాదండోయ్.. ఈ ఏడాది ఫిబ్రవరి 15 - 29 మధ్య చేశారట. మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ 53 వేల మంది సర్వేలో తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు పయనీర్ సంస్థ వెల్లడించింది. ఏదో ఒక విధంగా ఈసారి కూడా అధికారం దక్కించుకోవాలని ఇన్‌చార్జుల మీద ఇన్‌చార్జులను మారుస్తున్న జగన్ ఇక ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.