మొగుడు కొట్టాడనే బాధ కన్నా తోటికోడలు నవ్విందన్న బాధ ఎక్కువైందట ఓ మహిళకు.. ఇప్పుడు ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారం కూడా అలాగే ఉంది. బాబాయిని చంపేందుకు ఉపయోగించుకున్న వ్యక్తి అప్రూవర్‌గా మారిన విషయం కూడా వారిని పెద్దగా బాధించలేదు కానీ.. తమకు ఎన్నికల్లో ఎదురు నిలవడమనేది వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అతడితో పాటు అతని కుటుంబాన్ని బెదిరించారు అయినా సరే.. ఎన్నికల్లో తను పోటీ నుంచి తప్పుకోబోనని చెప్పడంతో అతని కుటుంబంపై దాడికి తెగబడ్డారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో అర్ధమైపోయే ఉంటుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు దస్తగిరి.
దస్తగిరి కుటుంబ సభ్యులపై దాడి..
వివేకా డ్రైవర్‌గా పని చేసిన దస్తగిరి.. ఒకానొక సమయంలో ఆయనకు రివర్స్ అయ్యాడు. ఆ తరువాత వివేకా హత్యకు ఇతర నిందితులతో చేతులు కలిపాడు. వివేకా హత్య కేసులో అరెస్ట్ అయి చివరకు అప్రూవర్‌గా మారి జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇప్పుడు జై భీమ్ భారత పార్టీ తరుఫున కడప ఎంపీగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. నాడు చేరదీసి డ్రైవర్‌గా పెట్టుకున్న పాపానికి వివేకానే హత్య చేసేందుకు వెనుకాడని వ్యక్తికి జగన్ అండ్ కోకు ఎదురు నిలవడం ఓ లెక్కా? అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన వైసీపీ పెద్దలు దస్తగిరి కుటుంబ సభ్యలుపై దాడి చేయించారు. తమ పార్టీ నేతలపైనే పోటీ చేసేంత మొనగాడా దస్తగిరి అంటూ అతని తండ్రిపై వైసీపీ నేతలు విచక్షణారహితంగా దాడి చేసి హత్యకు యత్నించారు.
జగన్‌వి అన్నీ సెల్ఫ్ గోల్సే..
దస్తగిరి పోటీ నుంచి విరమించుకోకపోతే కుటుంబం మొత్తాన్ని హతమారుస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల్లో పోటీకి వారు, వీరని తేడా ఏమీ లేదు. ఎవరైనా అర్హులే. అయినా ఇలా దాడులు చేయించడం జగన్‌కే చెల్లు. అసలు జగన్ స్థాయికి నిన్న మొన్నటి వరకూ రాజకీయాల్లో అడుగే పెట్టని దస్తగిరి ఒక లెక్కా? నిలబడినా ఆయనకు పోయేదేం లేదు. అనవసరంగా ఇలాంటి రాద్దాంతాలతో దస్తగిరిని హైలైట్ చేయడం తప్ప. ఇటీవలి కాలంలో జగన్‌వి అన్నీ సెల్ఫ్ గోల్సే. పట్టించుకోకుండా వదిలేస్తే సరి. కానీ ఇలా దాడులు చేయిస్తే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. రేపో మరునాడో కడప నుంచి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ రంగంలోకి దిగితే ఆమెపై కూడా ఇలాగే దాడి చేయిస్తారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.