ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలు హాట్ టాపిక్‌గా మారాయి. వాటిలో కుప్పం, గుడివాడ, పులివెందుల, నెల్లూరు, మంగళగిరి వంటివి ఆసక్తికరంగా మారాయి. కుప్పంలో ఎలాగైనా టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించాలని.. అలాగే మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను దెబ్బ కొట్టాలని వైసీపీ యత్నిస్తోంది. ఏపీ సీఎం జగన్‌ను ఆయన సొంత నియోజకవర్గమైన పులివెందులలో దెబ్బ కొట్టాలని.. తమ గురించి ఇష్టానుసారంగా మాట్లాడిన కొడాలి నానిని గుడివాడలో ఓడించాలని.. ఇక నెల్లూరు పార్లమెంటు టికెట్‌ను వైసీపీ విజయసాయిరెడ్డికి కట్టబెట్టింది. అక్కడ ఆయనను దెబ్బకొట్టాలని టీడీపీ యత్నిస్తోంది. మొత్తానికి టీడీపీ, వైసీపీలు తమ నియోజకవర్గాలతో పాటు తమ ప్రత్యర్థులకు కీలకమైన నియోజకవర్గాలపై కన్నేయడం చర్చనీయాంశంగా మారింది.
వైసీపీని దెబ్బకొట్టడం కష్టమే..
కుప్పం, పులివెందుల అనేవి సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుల కంచుకోటలు కాబట్టి వాటిని దెబ్బకొట్టడమనేది చాలా కష్టమైన పనే. గత ఎన్నికల్లో కూడా వైసీపీ నేతలు టీడీపీని దెబ్బ కొట్టాలని చూశారు. తొలి రెండు రౌండ్లు అప్పట్లో చంద్రబాబు స్వల్పంగా వెనుకబడటంతో ఆయన ఓటమి ఖాయమని వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఆ తరువాత మూడో రౌండ్ నుంచి సీన్ రివర్స్ అయ్యింది. ఇక పులివెందులలో రాజారెడ్డి రాజ్యాంగం కాస్త గట్టిగానే నడుస్తూ ఉంటుందని టాక్. నయాన అనే మాటకు స్థానమే లేదట. కేవలం భయమే ఉంటుందట. కాబట్టి అక్కడ వైసీపీని దెబ్బకొట్టడం కష్టమే. అయితే ఈ సారి అక్కడి నుంచి టీడీపీ బీటెక్ రవిని బరిలోకి దింపుతోంది. ఇక మంగళగిరిలో గత ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను వైసీపీ ఓడించింది. ఈ సారి కూడా ఆయన్ను ఓడించాలనే తాపత్రయంతో వైసీపీ ఇన్‌చార్జుల మీద ఇన్‌చార్జులను మారుస్తోంది. అలా మార్చకుంటే ఏమైనా సాధ్యపడేదేమో కానీ మార్చడంతో నేతల్లో నిరుత్సాహం వచ్చేసింది. ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేదు.
అహంకారంపై దెబ్బ కొట్టాలని..
ఇక గుడివాడ.. ఇక్కడ కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని.. నాని కంచుకోటను బద్దలు కొట్టాలని టీడీపీ యత్నిస్తోంది. టీడీపీ తరుఫున గుడివాడ నుంచి వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు. ఆయనకు అంగబలం, ఆర్థిక బలం మెండుగా ఉన్న వ్యక్తి. పైగా నియోజకవర్గంలో కొడాలి నానిపై వ్యతిరేకత బాగానే ఉందని టాక్. ఓడిపోతాననే అనుమానం కొడాలి నానికి కూడా ఉండే ఉంటుంది. అందుకే రాజకీయ సన్యాసమంటూ సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇక నెల్లూరులో విజయసాయిరెడ్డిని ఓడించి ఆయన అహంకారంపై దెబ్బ కొట్టాలని టీడీపీ భావిస్తోంది. ఇది పెద్ద కష్టమేమీ కాదు. విజయసాయి సొంత జిల్లాయే అయినా కూడా అక్కడ ఆయనకు అంగ బలం చాలా తక్కువ. పైగా ప్రత్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అర్థబలం, అంగబలం మెండుగా ఉన్న వ్యక్తి. పైగా జిల్లా దాదాపు టీడీపీకి ఫేవర్‌గా మారిపోయింది కాబట్టి విజయసాయిని వైసీపీ బలి చేస్తోందనే టాక్ చాలా రోజులగా నడుస్తోంది.