ఏపీలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. నిన్న మొన్నటి వరకూ బీజేపీ కూల్‌గా వ్యవహరిస్తోంది.. పొత్తుల గురించే మాట్లాడటం లేదు. కాబట్టి పొత్తు నై.. గిత్తు నై అన్న టాక్ నడిచింది. కానీ నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకరకమైన హడావుడి మొదలైంది. వైసీపీ సైతం అలెర్ట్ అయిపోయింది. ఇప్పటికే వైసీపీ గ్రూపుల వారీగా జనాలను ఆహ్వానించి తాయిలాలు అందజేస్తోంది. ఇక ఇప్పటి నుంచి జోష్ మరింత పెంచనుంది. ఇకపోతే బీజేపీతో టీడీపీ, జనసేనల పొత్తు అయితే ఫిక్స్ అయిపోయింది. ఒక్క సీట్ల వ్యవహారం మాత్రం ఇంకా కొలిక్క రాలేదు. నేటి భేటీతో అది కూడా ఫిక్స్ అవుతుంది.
ఇరు పార్టీలకూ నష్టమే..
సరే.. సీట్ల వ్యవహారం అన్నీ ఇవాళ తేలిపోతాయ్.. కానీ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ ఏంటంటే.. 2019లో మాదిరిగా పొత్తు సక్సెస్ అవుతుందా? అట్టర్ ఫ్లాప్ అవుతుందా? రెండింటికీ ఛాన్స్ ఉంది. బీజేపీకి అసలు ఏపీలో కేడరే లేదు కానీ ఆశలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. పెద్ద ఎత్తున సీట్లు కోరుతోందని టాక్. 6 లోక్‌సభ స్థానాలతో పాటు 10 అసెంబ్లీ స్థానాలు కోరుతోందట. ఇప్పటికే జనసేనకు 24 సీట్లు పోయాయి. సరే.. జనసేనకు ఇటీవలి కాలంలో ఏపీలో కేడర్ బాగానే పెరిగింది కాబట్టి ఆ పార్టీకి ఇచ్చినా పెద్దగా ఇబ్బంది లేదు. పైగా జనసేన సెపరేట్ అయితే ఓట్లు బీభత్సంగా చీలిపోయి ఇరు పార్టీలకూ నష్టమే జరుగుతుంది. ఇది 2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగా చూశాం కూడా.
బీజేపీతో లాభమేమైనా ఉందంటే..
2014 సరే.. మరి 2024లో పొత్తు హిట్టా.. ఫట్టా? అంటే ఏదైనా అవ్వొచ్చు. బీజేపీకి ఏం కేడర్ ఉందని అన్నేసి సీట్లు? దీని వలన టీడీపీకి నష్టంతో పాటు నేతల్లోనూ నిరుత్సాహం వచ్చేస్తుంది. ఒంటరిగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పార్టీ కోసం తమ స్థానాలను త్యాగం చేసి మరీ కష్టపడేందుకు ఎందుకు సాహసిస్తారు? దీని వలన నష్టమెవరికి? టీడీపీ, జనసేన కూటమికే కదా.. పైగా బీజేపీ ఓవర్‌గా స్థానాలు తీసుకుని ఓటమి పాలైతే.. వైసీపీకి అయాచిత లాభం చేకూర్చినట్టే అవుతుంది. కాబట్టి బీజేపీతో లాభమేమైనా ఉంది అంటే.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ఏమైనా అరాచకానికి పాల్పడితే అడ్డుకట్ట వేస్తుంది అంతే. అంతకు మించిన లాభమైతే లేదు. ఒకవేళ వైసీపీ రెచ్చిపోయి ఇబ్బందికర పరిణామాలు సృష్టించినా కూడా ఎంత కేడర్ ఉండి.. ఎంత బలముండి ఏం ప్రయోజనం? ఓటమి పాలవడమే కదా. కాబట్టి బీజేపీతో పొత్తు లాభమా? నష్టమా? అనేది మరికొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు.