ఏపీ రాజకీయాలు ఆసక్తికర పరిణామాలకు వేదిక కానున్నాయి. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో తెలియని పరిస్థితి. ఎప్పుడు ఎవరు జంప్ అవుతారో తెలియడం లేదు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే స్థానాలు ఫిక్స్. మరి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ ఎక్కడి నుంచి? అనేది ఆసక్తికరంగా మారింది. పవన్ పోటీపై రోజుకో ఇంట్రస్టిగ్ న్యూస్ వినిపిస్తోంది. తొలుత ఆయన భీమవరం నుంచి బరిలోకి దిగబోతున్నారంటూ టాక్ నడిచింది. ఆ తరువాత పిఠాపురం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఇక తాజాగా మరో న్యూస్ వినిపిస్తోంది. అది ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
కేంద్రంలో మంత్రి పదవి తీసుకుంటారా?
ఇంతకీ తాజాగా జరుగుతున్న ప్రచారం ఏంటంటారా? పవన్ కల్యాణ్ ఏపీలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీగా ఏ స్థానం నుంచి పోటీ చేయాలనే విషయంపై సమాలోచనలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఎన్డీఏ నుంచి కేంద్రంలో మంత్రి పదవి తీసుకునే యోచనలో ఉన్నారట. ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ ప్రచారం మాత్రం బీభత్సంగా జరుగుతోంది. ఒక పార్టీ అధినేత రాష్ట్ర రాజకీయాలను వీడి కేంద్రంలో మంత్రి పదవి స్వీకరిస్తారా? అది ఎంత వరకూ నిజం? ఒకప్పుడు చిరంజీవి కూడా కేంద్ర మంత్రి పదవి స్వీకరించారు. అయితే అది ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత మాత్రమే.
ఆ మాత్రం ఆలోచన చేయరా?
పైగా తను రెండింటికి పోటీ చేయటం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనే దానిపై తర్జనభర్జన పడుతున్నారట. నిజమే కదా.. అలా చేస్తే తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనే సంకేతాలు వెళ్లడం ఖాయమే కదా.. అలాంటి పిచ్చి పని పవన్ కల్యాణ్ చేస్తారా? ఆ మాత్రం ఆలోచన చేయరా? అనేది చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో అధికారం టీడీపీ - జనసేన కూటమిదేనని సర్వేలన్నీ చెబుతున్నాయి. అలాంటప్పుడు తమ పార్టీ అధికారంలోకి వచ్చాక మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి శ్రమిస్తారు కానీ కేంద్ర మంత్రి పదవి కోసం ఆశపడి పార్టీని గంగలో కలిపేస్తారా. మరోవైపు చూస్తే నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. ఏమో పవన్ ఆలోచన ఎలా ఉందో ఏమో మరి.. కొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు.