వైసీపీ చెత్త రాజకీయం.. ఎన్టీఆర్‌నూ వదలడం లేదు..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ తరుణంలో వైసీపీ ఒంటరిదై పోయింది. చాలా మంది నేతలు సైతం పార్టీని వీడారు. ఇక వేరే పార్టీలోకి అనుమతి లేని నేతలు, వేరే పార్టీలోకి వెళ్లినా కూడా టికెట్ దక్కడం కష్టమేనని భావించిన నేతలు మాత్రమే వైసీపీని పట్టుకుని వేలాడుతున్నారు. కొందరు మాత్రం అంతో ఇంతో ఆ పార్టీపై అభిమానంతో ఉన్నారు. ఇక ఇప్పుడు పార్టీని గెలిపించుకునేందుకు ఎన్ని మార్గాలున్నాయో.. అన్నింటినీ వైసీపీ నేతలు వెదుకుతున్నారు. ఈ తరుణంలోనే వైసీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ పేరును వినియోగించుకుని టీడీపీని ఇరుకున పెట్టేందుకు యత్నిస్తున్నారు. చక్కగా సినిమాలు చేసుకుంటూ తన పనిలో తాను ఉన్న ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి లాగుతున్నారు.
డోంట్ కేర్ బ్రదర్..
గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు తప్ప మరే విషయంలోనూ వేలు పెట్టడం లేదు. కనీసం తన మేనత్త భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా తూలనాడినప్పుడు సైతం ఆయన స్పందించలేదు. విపరీతంగా విమర్శలొస్తే ఏదో రెండు ముక్కలు మాట్లాడిన వీడియో రిలీజ్ చేసి సైలెంట్ అయ్యాడు. టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు కూడా తారక్ స్పందించలేదు. ఆ సమయంలో టీడీపీ నేతలతో పాటు కేడర్‌కు విపరీతంగా కోపం వచ్చింది. హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అయితే ఎన్టీఆర్ పేరు తీసుకొచ్చిన మీడియా దగ్గర ‘డోంట్ కేర్ బ్రదర్’ అని సమాధానం ఇచ్చారు. ఈ పరిణామాలన్నింటి నడుమ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి లాగితే లబ్ధి చేకూరుతుందని వైసీపీ ప్లాన్ చేస్తోంది.
ఇబ్బందులు పెట్టడమేంటి?
ఈసారి ఎన్నికల్లో లోకేష్, చంద్రబాబును గెలిపిస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోంచి తోసేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా వ్యాఖ్యానించారు. పైగా పుట్టినరోజుకి, చావుకు తేడా తెలియని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను సీఎం చేసేందుకు.. ఎన్టీఆర్ మీద కుట్రలు చేసి, అనేక ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. అసలు ఎన్టీఆర్ ఊసే టీడీపీ నేతలెవరూ ఎత్తడం లేదు. అలాంటప్పుడు కుట్రలు చేయడమేంటి? ఇబ్బందులు పెట్టడమేంటి? సడెన్‌గా ఎన్టీఆర్ పేరును రాజకీయాల్లోకి లాక్కొచ్చేది వైసీపీ నేతలే. రచ్చ చేసేది వైసీపీ నేతలే. పైగా టీడీపీపై ఆరోపణలు. అసలు ఇవాళ కాదు.. ఆది నుంచి వైసీపీ నేతలు అంతే.. బోడిగుండుకు మోకాలుకు ముడిపెట్టేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ కూడా తన సినిమాలేవో తాను చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. అలాంటి ఆయనను రాజకీయ రొంపిలోకి లాగడం అవసరమా? కొడాలి నాని వంటి వారికి ఎన్టీఆరే మళ్లీ తన పేరును తీసుకురాకుండా వార్నింగ్ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.