నాని.. అనే నేను ఇక పోటీచేయను!
కొడాలి నాని.. బహుశా ఈ పేరు తెలియని వారుండరేమో. ఒక్క గుడివాడలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఈయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఇందుకు కారణం మాస్ లీడర్ కావడమే. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా నాలుగుసార్లు గెలిచారు. పార్టీలు వేరైనప్పటికీ 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచి గుడివాడను కొడాలి తన అడ్డాగా.. కంచుకోటగా మలుచుకున్నారు. అయితే ఇక రాజకీయాలు చాలు.. ఒపిక, వయసు లేదంటూ చెబుతున్నారు. 2024 ఎన్నికలో ఫైనల్ అని.. 2029 ఎన్నికల్లో పోటీచేయనని తేల్చిచెప్పేశారు. ఈ ఒక్క మాటతో అటు వీరాభిమానులు, అనుచరులు.. ఇటు వైసీపీ పెద్దలు ఉలిక్కిపడ్డారు. సారేంటి.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అభిమానులు.. ఇలాంటి మాస్ లీడర్ లేకపోతే పరిస్థితేంటని వైసీపీ హైకమాండ్ ఆలోచనలో పడింది.
సడన్‌గా ఎందుకమ్మా..?
కొడాలి నాని ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీ అధినేతకు వీర విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నాని.. కార్యకర్తగా మొదలైన కేరీర్.. ఎమ్మెల్యేగా, మంత్రిగా స్థాయికి ఎదిగింది. టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరి.. ఆయనకు అత్యంత ఆప్తుడిగా, నమ్మినబంటుగా మారారు. సీన్ కట్ చేస్తే ఊహించని రీతిలో నానిని.. జగన్ కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో నానిలో ఎనలేని ఉత్సాహం వచ్చింది. అలా నాని రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక అవన్నీ అటుంచితే.. 2024 ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో గెలవడానికి నాని ఇలా మాట్లాడుతున్నారా లేకుంటే.. నిజంగా రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారో తెలియట్లేదు కానీ.. సంచలన ప్రకటనే చేసేశారు. ఇంత సడన్‌గా నాని ఎందుకు నిర్ణయం తీసుకున్నారనే చర్చ కూడా మొదలైంది. అయితే ఇన్‌సైడ్ మాత్రం చిత్రవిచిత్రాలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
వారసుడు ఇదిగో..!
అవును.. ఇవే ఈ 2024 ఎన్నికలు చివరివి.. 2029 ఎన్నికల్లో పోటీచేయనని తేల్చి చెప్పారు. అంతేకాదు.. తన ఇద్దరు కుమార్తెలకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని అని కూడా చెప్పేశారు. అయితే.. ఇక్కడే ఇంకో చిన్న హింట్ ఇచ్చేశారు నాని. తన సోదరుడి కుమారుడు రాజకీయాల్లోకి రావచ్చని.. ఆసక్తి చూపుతున్నాడని చెప్పకనే చెప్పేశారు. అయితే రాజకీయాలకు ఎందుకు గుడ్ బై చెప్పేయాలని అనుకుంటున్నాననే దానికి పెద్ద కథే చెప్పుకొచ్చారు నాని. గుడివాడకు పర్మినెంట్‌గా రోడ్లు వేసి స్ట్రక్చర్ చేయాల్సి ఉందని.. దీంతో పాటు 500 నుంచి 600 కోట్ల రూపాయిల పనులు (రోడ్లు, కాలువలు, వాల్స్) ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వకపోయినా సరే.. ఈ పనులు చేస్తే చాలు.. అన్నీ అయ్యాక 2029 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీచేయనని చెప్పేశారాయన. అప్పుడిక గుడివాడ సీటు ఎవరికిచ్చుకున్నా.. ఏ కొత్త కుర్రాడికి ఇచ్చినా అభ్యంతరం లేదన్నట్లుగా చెప్పేశారు. చూశారుగా.. అటు వారసుడు ఉన్నాడని చెబుతూనే ఇక్కడేమో కొత్త వ్యక్తులకు ఇచ్చినా ఓకే అంటున్నారు నాని. అంటే.. ఈ మాటలన్నీ తేడాగానే కనిపిస్తున్నాయ్. మరోవైపు.. నాని ఈ ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోతున్నారనే ఇలా సెంటిమెంట్ పండిస్తున్నారని.. ఇదంతా సింపతీ కోసమేనని నియోజకవర్గంలో గట్టిగానే టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజానిజాలెంతో.. అసలు ఈసారి జగన్ గెలిచి 500 నుంచి 600 కోట్ల రూపాయిలు ఇచ్చే పరిస్థితి ఉంటుందో.. రిటైర్మెంట్ అయ్యేపనేనా..? అనేది వేచి చూడాల్సిందే మరి.