ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బీభత్సంగా కలలు కంటున్నారట. రియల్ లైఫ్‌లో చేయలేనవన్నీ కలల్లో చేస్తున్నారో ఏమో కానీ నా కల అది.. నా కల ఇది అంటూ పోస్టర్లు ముద్రించి రాష్ట్రం మొత్తం అంటిస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటేనే ఒకట్రెండు సినిమాలు తీసి జనాల ఖర్మకు వదులుతుంటారు జగన్. రాష్ట్రాన్ని పాలించే నాలెడ్జ్ పెద్దగా ఉన్నట్టు ఇప్పటి వరకూ కనిపించలేదు కానీ.. సినిమా నాలెడ్జ్ అయితే బాగానే ఉన్నట్టుంది. అందుకే స్లోగన్స్ కోసం పెద్దగా వెదుక్కోరు. 'మా నమ్మకం నువ్వే జగన్’.. 'మా భవిష్యత్ నువ్వే జగన్’.. ‘సిద్ధం’ ఇలా రకరకాల పోస్టర్లతో ఇప్పటి వరకూ ఊదరగొట్టారు. ఇక ఇప్పుడు కొత్త పోస్టర్లు సిద్ధమయ్యాయండోయ్.. వాటిని చూస్తే మైండ్ గిర్రున ఒక రౌండ్ కొడుతుంది.
కార్మికుల కల.. నా కల
‘అత్తారింటికి దారేది’ సినిమాలో బ్రహ్మానందమే హీరో, హీరోయిన్ తదితర పాత్రలన్నీ పోషించి ఓ సినిమా తీస్తారు. ఆ సీన్ సినిమాలో బాగా వర్కవుట్ అయ్యింది. ఏపీలో జగన్ కూడా అంతే.. తనను జనాలు అంటున్నట్టుగా ఊహించుకుంటున్నారో.. లేదంటే జనాలు ఎలాగూ అనరు కాబట్టి మనల్ని మనమే అనేసుకుందామన్న తాపత్రయమో కానీ తన పాత్రతో పాటు జనాల పాత్ర కూడా తనే పోషించి ‘ మా నమ్మకం నువ్వే జగన్.. మా భవిష్యత్ నువ్వే జగన్’ అంటూ రచ్చ చేసుకున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా ‘నాకు ఓ కల ఉంది’ అంటూ తన కలలన్నీ బయటపెట్టేశారు జగన్. ‘రైతుల కల.. నా కల, కార్మికుల కల.. నా కల, విద్యార్థుల కల.. నా కల’ అంటూ పోస్టర్లు ముద్రించేసి నేడో రేపో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంచారు.
జగన్ ఫ్లెక్సీ, బ్యానర్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు .
ఈ కల గోలేంటా? అనుకుంటున్నారా? అట్లనే ఉంటది జగనన్నతో... మేటర్ వీక్‌గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుందన్న విషయం జగన్‌కు తెలిసి ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి జగన్‌కు ఏం చేయాలో తెలియడం లేదు. సలహా తీసుకుందామంటే ప్రశాంత్ కిషోరే రివర్స్‌లో జగన్ పోవడం ఖాయమని శాపనార్థాలు పెడుతున్నారు. ఈ సమయంలో ఏం చేయాలో పాలుపోక కలలు.. కల్లలంటూ ఫ్లెక్సీ, బ్యానర్ల కోసం కోట్ల రూపాయలు తగలేస్తున్నారు. ఇవన్నీ జనాల నెత్తినే వేస్తారనడంలో సందేహం లేదు. అసలు నిజంగా జనాల కలేంటో జగన్ తెలుసుకోవడం లేదు. చెత్త నుంచి ప్రతి ఒక్క దానిపై పన్నుల బాధ నుంచి విముక్తి లేదు. నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు లేదు. ఫ్యాక్టరీలు ఉన్న వాటినే తరిమి కొట్టారు. ఇతర బెనిఫెట్స్ దేవుడెరుగు.. ఉద్యోగులకు సకాలంలో జీతాలే లేవు. ఐదేళ్లు అధికారంలో ఉండి వారి కలలు నెరవేర్చకుండా ఇప్పుడు కలల పాఠం వల్లెవేస్తే ఎలాగని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.