మంత్రి రోజాకు టికెట్ ఇవ్వాలా.. వద్దా అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెగ ఊగిసలాడుతున్నారట. సర్వేల ప్రకారం చూస్తే రోజాకు ఇవ్వకపోవడమే బెటర్ అనే యోచనలో ఉన్నారట. మరోవైపు వైసీపీలో బీభత్సంగా రచ్చ చేసి.. ఎదుటి పార్టీ నేతలను ఇష్టానుసారంగా మాట్లాడే అతి కొద్ది మంది నేతల్లో రోజా ప్రముఖ స్థానంలో ఉన్నారు. అలా చూసుకుంటే టికెట్ ఇవ్వాలి. లేదంటే అలిగి రేపు సైలెంట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అసలే వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ తరుణంలో ఇలాంటి ప్రయోగాలు అవసరమా? అని కూడా అధినేత యోచిస్తున్నారట. రోజాకు టికెట్ ఇస్తే టీడీపీ నేతలు కాదు ఓడించేది.. సొంత పార్టీ నేతలంతా కలిసి ఆమెను ఓడిస్తారని టాక్.
నగరిని కుదిపేస్తున్న రోజా వ్యవహారం..
రోజా పుణ్యమాని నగరిలో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇప్పటికే నగరిలోని ఐదు మండలాల నేతలు ఆమెకు టికెట్ ఇవ్వొద్దని రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధిష్టానానికి రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ ఒక లేఖను కూడా సీఎం జగన్‌కు అందజేశారు. అయినా సరే.. జగన్ మొండిగా వెళ్లి ఆమెకు టికెట్ ఇస్తే పార్టీ పక్కాగా ఒక స్థానాన్ని కోల్పోయినట్టే. మొత్తానికి రోజాకు టికెట్ వ్యవహారం నగరిని కుదిపేస్తోంది. ఆది నుంచి కూడా రోజా నియోజకవర్గానికి ఏమీ చేసింది లేదు. వారానికి రెండు తిరుమల వెంకన్న దర్శనాలు.. ఒక జగన్ దర్శనం.. ఆపై పర్యాటక శాఖ మంత్రిగా పర్యటనలు చేయడం తప్ప చేసిందేమీ లేదు. పైగా తన కుటుంబాన్ని బీభత్సంగా బాగు చేసేసుకుంది.
ఫైర్ అవుతున్న వైసీపీ నేతలు..
దందాలు.. సెటిల్‌మెంట్స్ చేస్తూ వైసీపీ నేతలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ముఖ్యంగా నియోజకవర్గంలో రోజా భర్తతో పాటు ఆమె సోదరులే పెత్తనం చెలాయిస్తున్నారట. వీరి అక్రమాలకు అంతనేదే లేకుండా పోతోందని వైసీపీ నేతలే ఫైర్ అవుతున్నారు. గతంలో వైవీ సుబ్బారెడ్డి రోజాపై ఫిర్యాదు చేశారు. అలాగే మంత్రి పెద్దిరెడ్డికి సైతం ఫిర్యాదులు అందాయి. అయినా సరే.. ఆమెపై చర్యలకు వైసీపీ అధిష్టానం సహా కీలక నేతలెవరూ కూడా సాహసమే చేయడం లేదు. సర్వే, ప్రజాబలం తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని జగన్ తమ పార్టీ అభ్యర్థులకు టికెట్ కేటాయిస్తున్నారు. ఆ లెక్కన చూసుకుంటే రోజాకు టికెట్ ఇవ్వకూడదు. రోజా అయితే తనకే టికెట్ ఇస్తారని చెప్పుకుంటున్నారు. మరి అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి రోజా అయితే జగన్‌కు తలనొప్పిగా మారిందట.