తెలంగాణలో మరోసారి ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గత ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు రచ్చ లేపాయి. అవి ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి హవా కొనసాగిస్తోంది. ఇప్పటి వరకైతే జనరంజక పాలన చేస్తోంది. దీంతో పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది. పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇక తాజాగా 200 లోపు యూనిట్ల వారికి కరెంట్ బిల్ కట్.. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాలన్నీ మహిళలతో పాటు పురుషులను సైతం ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ పథకాలతో పాటు కాంగ్రెస్ పాలన ఆ పార్టీకి ఎలాంటి ఫలితాన్నిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
9 స్థానాలను హస్తం పార్టీ గెలవనుందట..
పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కాంగ్రెస్.. అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన హవాను తిరిగి తెచ్చుకోవాలని బీఆర్ఎస్.. ఢిల్లీకి గిఫ్ట్ ఇవ్వాలని బీజేపీ తహతహలాడుతున్నాయి. మరి ఈ మూడు పార్టీల్లో దేనికి సార్వత్రిక ఎన్నికలు ఫేవర్‌గా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. దీనికి తాజాగా ఇండియా టీవీ, సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ సమాధానం చెప్పింది. తెలంగాణ పార్లమెంటు ఎన్నికలపై సర్వే నిర్వహించిన ఈ సంస్థలు దీనిలోనూ కాంగ్రెస్‌కే పట్టం కట్టబెడుతున్నాయి. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గానూ.. అత్యధికంగా 9 స్థానాలను హస్తం పార్టీ గెలవనుందని అంచనా వేస్తోంది. వండర్ ఏంటంటే.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండే రెండు స్థానాలను గెలుచుకోబోతోందని సర్వే సంస్థలు తేల్చాయి.
ఈసారి సీన్ పూర్తిగా రివర్స్..
ఇక ఐదు స్థానాల్లో బీజేపీ గెలవనుందని సర్వే సంస్థలు తేల్చాయి. ఎంఐఎం ఎప్పటి లాగే ఒక స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంటుందట. ఇక బీజేపీ ఏ ఏ స్థానాలను గెలుచుకుంటుందో కూడా సర్వే సంస్థలు వెల్లడించాయి. కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుందట. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధించాయి. ఇప్పుడు అదే 9 స్థానాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటుందట. గత ఎన్నికల్లో 2 స్థానాలను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్.. ఈసారి దాదాపు 5 రెట్లు ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందట.