ఎన్నికల తర్వాత విశాఖ రాజధాని అట.. అర్థమవుతోందా..!
ఐదేళ్లకు జగన్ పాలనకు ఎండ్ కార్డ్ పడబోతోందని సర్వేలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. అసలు ఎవరో చెప్పడమెందుకు? ఏపీలో పరిస్థితులను పరిశీలిస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత ఏదో పిచ్చిపట్టినట్టుగా సిట్టింగ్‌లను మార్చేశారు. పోనీ మార్చేసి అలా ఊరుకున్నారా? అంటే మళ్లీ మార్పులు.. బాబోయ్.. అసలు ఎక్కడా మనసు స్థిమితంగా లేనట్టుంది.. ఓటమి భయం బాగా పట్టుకున్నట్టుంది అనిపిస్తుంది చూసే వారెవరికైనా. ఇక వలసలు కూడా బీభత్సంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు మరోసారి ఆయన విశాఖ రాజధాని.. అంటూ వ్యాఖ్యానించారు. ఆలు లేదు.. చూలు లేదు.. రాజధాని పేరు విశాఖ అంటున్నారు జగన్.
వ్యతిరేకం కాదట.. వింటున్నారా?
అరే.. వచ్చేదెంతో తెలియదు కానీ ఎన్నికలవగానే విశాఖే రాజధాని అని నేడు సభలో పేర్కొన్నారు. అటు అన్నారో లేదో ఇటు ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. ఈ మధ్య ట్రోలర్స్, మీమర్స్‌కి కంటెంట్ కోసం వెదుక్కోవాల్సిన అవసరమే రావడం లేదు. కావల్సిన కంటెంట్ అంతా జగన్ ఇచ్చేస్తున్నారు. ‘వైజాగ్ విజన్-ఫ్యూచర్ విశాఖ’ పేరుతో మంగళ, బుధవారాల్లో జగన్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇక్కడే జగన్ ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటానని.. విశాఖే రాజధాని అని తేల్చి చెబుతున్నారు. ఇక అమరావతికి తాను వ్యతిరేకం కాదట.. వింటున్నారా? అంతా. ఎన్నికల తర్వాత అమరావతిని శాసన రాజధానిని చేస్తారట. కామెడీ కాదు.. సీరియస్.. నవ్వకండి.
తోటకూర కబుర్లు చెబితే ఎలా?
జగన్ ఏది చెప్పినా కామెడీగానే అనిపిస్తుంది జనాలకు. ఎన్నికల తర్వాత విశాఖ రాజధాని ఏంటి.. అసలు వచ్చే ఎన్నికల్లో గెలవాలి కదా అంటారా? ఒక్క ఛాన్స్ అనగానే ఇచ్చిన ప్రజానీకం రెండో ఛాన్స్‌ను ఇవ్వదా? అని చిన్ని ఆశ. దాదాపు ఐదేళ్ల పాటు కాలయాప చేసి అమరావతే రాజధాని అంటూ అధికారంలోకి వచ్చి.. మూడు రాజధానులంటూ నానా రచ్చ చేసి.. చివరకు విశాఖే రాజధాని.. రుషికొండే నా అడ్డ.. అంటూ తోటకూర కబుర్లు చెబితే ఎలా? జనాలను మభ్య పెట్టినట్టుగా పారిశ్రామిక వేత్తలను సైతం నమ్మించేందుకు జగన్ నానా తంటాలు పడుతున్నారు. విశాఖ ప్రపంచాన్ని ఆకర్షించడంతో పాటు విశాఖలో జరిగే నిర్మాణాలన్నీ కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయట. ఏంటో జగన్ ఇంకా జనాలను ఎలాగోలా మభ్యపెడదామనే తాపత్రయమే.. పార్టీలో ఉన్న వాళ్లు ఆయనకు అర్థమయ్యేలా చెప్పరు. జంప్ చేస్తున్నవాళ్లు మాకెందుకులే అనుకుని అలా వదిలేశారు.